ప్రయాణికుల సౌకర్యార్థం కోసం ప్రైవేటు బస్సులకు ధీటుగా హైటెక్ హంగులతో లహరి స్లీపర్ బస్సులను తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చింది టీఎస్ఆర్టీసీ. ఈ బస్సులను హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. కొత్తగా 760 బస్సులకు ఆర్డర్ పెట్టామని, వాటిలో ఇప్పటికే 400పైగా బస్సులు డిపోలకు చేరుకున్నాయని తెలిపారు.
త్వరలోనే 1,300 ఈవీ బస్సులను తీసుకొస్తున్నామని, ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని వెల్లడించారు. ప్రయాణికులకు సౌకర్యం కోసం ప్రైవేటు బస్సులకు ధీటుగా లహరి స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి చెప్పారు. ఇప్పటికే ఆర్టీసీలో వీలైనంత సాంకేతికతను ఉపయోగిస్తున్నామని తెలిపారు మంత్రి అజయ్ కుమార్.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ పాల్గొన్నారు. ‘లహరి-అమ్మఒడి అనుభూతి’గా నామరణం చేసిన ఈ బస్సులు బెంగళూరు, హుబ్లీ, విశాఖపట్నం, తిరుపతి, చెన్నై మార్గాల్లో సేవలు అందించనున్నాయి.
కాగా ఈ ఏసీ స్లీపర్ బస్సు 12 మీటర్ల పొడవు, 30 బెర్తుల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ బస్సుల్లో ఉచిత వై-ఫై సౌకర్యంతో పాటు ట్రాకింగ్ సిస్టం, పానిక్ బటన్ సదుపాయాన్ని కల్పించారు. వాటర్ బాటిల్ సాకెట్, మొబైల్ చార్జింగ్ సౌకర్యం, రీడింగ్ ల్యాంప్ లను కూడా ఏర్పాటు చేశారు. గమ్యస్థానాల వివరాలు తెలిపేలా ఎల్‌ఈడీ డిస్‌ప్లే బోర్డులుంటాయి.