సంక్రాంతి సంబరాల్లో పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. మంత్రి తలసాని, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గంగిరెద్దులు, హరిదాసు కీర్తనలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది.
అనంతరం తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. ముందుగా ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పేవే తెలుగు పండుగలు అన్నారు. మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం చిన్నారులకు గాలి పటాలను పంపిణీ చేశారు. ఆ తర్వాత వారితో పాటు పతంగులను ఎగుర వేశారు.
కొత్త సంవత్సరంలో జనవరి నెలలో ముందుగా వచ్చే పండుగ సంక్రాంతి అన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న పాడి పంటలతో ఆయురారోగ్యాలతో సంతోషంగా పండుగ జరుపుకోవాలని కోరారు.
సంక్రాంతి వచ్చిందంటే ఆడపడుచులు రంగురంగుల ముగ్గులతో తమ ఇంటి ముంగిళ్లు అలంకరించి గొప్పగా చేసుకుంటారన్నారు. మా చిన్నతనంలో పండుగను అందరం కలిసి జరుపుకునే వాళ్లమన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మన సంస్కృతి, సంప్రదాయాలు పండుగల గురించి చెప్పాలన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.