తెలంగాణ ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాడులు చేస్తూ వేధిస్తున్నారని మండిపడ్డారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆదివారం ఆయన కొమురవెళ్లి మల్లన్నను దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రానికి దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడాలని, ప్రశ్నించే గొంతులను నొక్కడం సరి కాదని పేర్కొన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టే ఈడీ విచారణను ధైర్యంగా ఎదుర్కొంటున్నారన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐలను బీజేపీ ఏజెంట్లుగా మార్చుకుందని మంత్రి తలసాని ఫైర్ అయ్యారు. బీజేపీ దేశంలో దేవుళ్ల పేరుతో రాజకీయం చేస్తోందన్నారు. ఎవరెన్ని చేసినా తెలంగాణలో బీఆర్ఎస్ కు తప్ప ఇతర ఏ పార్టీకి అవకాశం లేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వంద సీట్లకు పైగా గెలుస్తామని స్పష్టం చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కవిత పట్ల చేసిన వ్యాఖ్యలు.. దేశ వ్యాప్తంగా మహిళలు తలదించుకునే మాట్లాడాడని మండిపడ్డారు. హిందూ ధర్మం పేరుతో రాజకీయాలు చేసే బీజేపీ నాయకులు మహిళల పట్ల చేస్తున్న వ్యాఖ్యాలే మీ సంస్కారానికి నిదర్శనం అంటూ తలసాని ఎద్దేవా చేశారు.
స్టేషన్ ఘనపూర్ మహిళా సర్పంచ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపడుతుందని వెల్లడించారు. సరైన ఆధారాలు ఉంటే సీఎం కేసీఆర్ ఎవ్వరినీ ఉపేక్షించరని తెలిపారు. దేశంలో తమ పార్టీతో కలిసి వచ్చే పార్టీలతో కలిసి దేశంలో మార్పుకు శ్రీకారం చుడుతామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.