టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై, బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మాటలన్నీ దొంగ మాటలన్నారు. అలాగే రేవంత్ తో పాటు ఉన్న వాళ్లందరూ దొంగలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం కట్టించిన ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు.. కాంగ్రెస్ కట్టించిన 10 ఇళ్లతో సమానమన్నారు మంత్రి వేముల.
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మాటలు తప్ప.. రూపాయి సాయం లేదంటూ దుయ్యబట్టారు. బాల్కొండలో కట్టిన ప్రతీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేసీఆర్ ఇచ్చిన పైసలతోనే కట్టిందని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులవన్నీ అబద్ధపు మాటలు, అసత్యపు ప్రచారాలని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ ని కట్టడి చేయాలని ఆయన బిడ్డ కవిత్మను కేసుల పేరుతో వేధిస్తున్నారని నిప్పులు చెరిగారు. లక్షల కోట్లు దోచుకున్న మోడీ దోస్త్ అదానీ మీద విచారణ చేయాలని పార్లమెంట్ లో ప్రతీ ఎంపీ ప్రశ్నిస్తున్నాడని తెలిపారు వేముల ప్రశాంత్.
ఎల్ఐసీ, ఎస్బీఐలో ప్రజల డబ్బులు మాయం చేసిన అదానీ మీద విచారణ చేయరు కానీ.. సంబంధం లేని కేసులో కవితమ్మను విచారణ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని కిసాన్ సమ్మాన్ యోజన పథకం ప్రారంభంలో నిజామాబాద్ జిల్లాలో ఎంత మందికి వచ్చిందని, ఇప్పుడు ఎంత మందికి వస్తుందని ఎంపీ అరవింద్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.