తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్ కొంపల్లిలోని ఈఎంఆర్ఐ, జీహెచ్ఎస్ లో కానిస్టేబుళ్లకు కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్) శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మల్లారెడ్డిలు పాల్గొన్నారు. ఇందులో భాగంగా కానిస్టేబుళ్లకు సీపీఆర్ ఎలా చేయాలో మార్గ నిర్దేశం చేశారు. ఆ సమయంలో సీపీఆర్ చేసే వారికి ఎక్కువ బలం అవసరమవుతుందన్నారు.
అలా మంత్రులు కూడా వచ్చి సీపీఆర్ ఎలా చేయాలో తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి కూడా సీపీఆర్ చేయడం ట్రయల్ చేశారు. అది చూసిన మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ నవ్వుతూ ఆ సన్నివేశాన్ని వీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో నాన్ కమ్యూనికేబుల్ రోగాలు అధికంగా వస్తున్నాయన్నారు. అందులో ముఖ్యమైనది సడెన్ కార్డియాక్ అరెస్ట్ అని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలు, మాల్స్, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ లలో సీపీఆర్ శిక్షణ పొందిన వారిని నియమించాలన్నారు. లైఫ్ స్టైల్ ఛేంజెస్ వల్ల ఈ రోగాలు చుట్టుముడుతున్నాయన్నారు. సీపీఆర్ ను నేర్పించగలిగితే చాలా వరకు సడెన్ కార్డియాక్ అరెస్ట్ ను తగ్గించవచ్చన్నారు కేటీఆర్.
అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కార్డియాక్ అరెస్ట్ ఎవరికైనా రావొచ్చు.. అది రావడానికి సమయం, సందర్భం లేదన్నారు. మన దేశంలో ఏడాదికి 15 లక్షల మంది సడెన్ కార్డియాక్ అరెస్ట్ తో చనిపోతున్నారని తెలిపారు. ఈ చనిపోతున్న వారి సంఖ్యను సీపీఆర్ ప్రక్రియ ద్వారా తగ్గించుకోవచ్చన్నారు. సీపీఆర్ ప్రక్రియను విజయవంతం చేయగలిగితే 10 మందిలో ఐదుగురిని బతికించుకోవచ్చని.. డబ్ల్యూహెచ్‌వోతో పాటు పలు ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయని పేర్కొన్నారు హరీష్ రావు.