మూడు నెలల్లో కుక్కలు, కోతుల దాడులు తగ్గిస్తామంటూ తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గురువారం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ పశు భవన్ లో వీధి కుక్కల బెడదపై హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షా సమావేశంలో భాగంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. వీధి కుక్కలు, కోతుల సమస్య, నివారణ చర్యలపై విస్తృతంగా చర్చించారు.
సాధారణంగా జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో తీసుకున్న చర్యలు, భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలపై పురపాలక, పశుసంవర్థక శాఖ అధికారుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించామన్నారు.
రోడ్లపై ఇష్టం వచ్చినట్లు మాంసం వేయవద్దన్నారు. అవసరమైతే రాత్రి సమయాల్లో మున్సిపల్ సిబ్బంది డ్యూటీ చేస్తారన్నారు. కుక్కల దాడిలో మరణించిన బాలుడి కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. మూసీ నది పరివాహక ప్రాంతాలు, శివారు ప్రాంతాల్లో కూడా మాంసం వ్యర్థాలు నిర్వహణ పట్ల జాగ్రత్తలు తప్పనిసరి అని తలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ విజయలక్ష్మి, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా, సంచాలకులు డాక్టర్ రామ చందర్, జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ పాల్గొన్నారు.