తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షంతో పలు పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికి వచ్చిన పంట కాస్తా.. పాడైపోయిందని లబోదిబోమంటున్నారు. దీంతో వికారాబాద్ జిల్లా రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రులు నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు శుక్రవారం వికారాబాద్ లో పర్యటించారు.
మర్పల్లి, మోమిన్‌పేట మండలాల్లో నష్టపోయిన ఉద్యాన, దెబ్బతిన్న మామిడి, ఉల్లిగడ్డ, బొప్పాయి వంటి ఉద్యాన పంటలు, మొక్కజొన్న వంటి వ్యవసాయ పంటలను పరిశీలించారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
అకాల వర్షాలు వికారాబాద్ జిల్లాలో బీభత్సం సృష్టించాయి. మర్పల్లి, మోమిన్ పేట మండలాల్లోని 13 గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది. ఏకధాటిగా అరగంట నుంచి గంట వరకు వడగండ్లు పడటంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వడగండ్లు రోడ్ల మీద పడి విదేశాల్లోని మంచు ప్రాంతాలను తలపించాయి.
అయితే వడగండ్ల కారణంగా చాలా చోట్ల పంటలు పాడైపోయాయి. మోమిన్‌పేట మండల పరిదిలోని 400 ఎకరాల్లో కూరగాయ పంటలు, మొక్కజొన్న, గోధుమ, జొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన చెందారు. ఈ క్రమంలోనే నష్టపోయిన పంటలను మంత్రులు నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో కలిసి రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పరిశీలించి, నష్టపోయిన రైతులను పరామర్శించారు.