ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తప్పులు చేసి సిగ్గులేకుండా ఢిల్లీకి వెళ్లి దీక్షలు చేస్తోందని, కవితక్కను అరెస్ట్ చేయకపోతే.. ముద్దు పెట్టుకుంటారా? అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్సీ కవితపై బండి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. దీంతో పలువురు బీఆర్ఎస్ నేతలు బండి సంజయ్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా ఢిల్లీ, హైదరాబాద్ లలోని తెలంగాణ భవన్ ల వద్ద బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మరోవైపు బండి సంజయ్ పై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.
తాజాగా బండి సంజయ్ ఈ వ్యాఖ్యలపై మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ రియాక్ట్ అయ్యారు. బండి సంజయ్ వ్యాఖ్యలు సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు మంత్రి సత్యవతి. తెలంగాణ గడ్డపై పుట్టినవారు కేసులకు భయపడరన్నారు. కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ పోరాటం చేశారు.. బీజేపీ మెడలు వచ్చే రోజులు దగ్గరరలోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. మహిళా లోకం తిరగబడితే బండి సంజయ్ అధోగతే అంటూ ఫైర్ అయ్యారు సత్యవతి.
బీజేపీ నేతలు నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడవద్దంటూ హెచ్చరించారు. బండి సంజయ్ ని బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా? లేక పార్టీ వైఖరా? అని నిలదీశారు. ఈడీని వేట కుక్కలా ఉసిగొల్పుతున్నారన్నారు. చీమ చిటుక్కుమంటే స్పందించే గవర్నర్.. మహిళలపై బండి చేసిన వ్యాఖ్యలపై ఎందుకు స్పందించరంటూ ప్రశ్నించారు సత్యవతి రాథోడ్.
అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. బండి సంజయ్ వెంటనే మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడం తప్ప మీకేం తెలుసు అంటూ దుయ్యబట్టారు. కేసీఆర్ ను చూసి బీజేపీ నేతలకు భయం పట్టుకుంది.. అందుకే దర్యాప్తు సంస్థల్ని ఉసిగొల్పి కక్ష సాధిస్తున్నారంటూ మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ వెనక్కి తీసుకోవాలన్నారు సబితా ఇంద్రారెడ్డి.