తక్షణ చర్యగా 2500 బస్సులను అద్దె పద్ధతిలో తీసుకుని నడపాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టుగా సీయంవో ఇచ్చిన ప్రకటనలో పేర్కొన్నారు. అంటే, రేపటి నుంచి ప్రయివేటైజేషన్ ప్రక్రియ దశలవారీగా జరుగుతుంది. పర్యావరణం పేరుతో గ్రీన్ బస్సులు తెస్తారు కనుక, మెఘా కాంట్రాక్లర్ల పంట పండినట్టే. ఈ వ్యవహారమంతా బయట పెడుతున్నారనే దుగ్ధతోనే రవిప్రకాశ్ అరెస్టు జరిగిందని జర్నలిస్టులు అనుమానిస్తున్నారు.
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె వ్యవహారం వెనుక చాలా పెద్ద కథే వుందని అర్ధం అవుతోంది. దశలవారీగా ప్రయివేట్ బస్సుల్ని తీసుకొచ్చే ప్రయత్నం షురూ అయినట్టుగా ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. సమ్మె పేరుతో ఒక్కసారే ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగ సిబ్బందిని వదుల్చుకుంటే అన్నిరకాలుగా మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు కనిపిస్తోందని యూనియన్లు సందేహం వ్యక్తంచేస్తున్నాయి.
ఏపీలో ప్రభుత్వపరం చేయలేదా..?
ఏ రాష్ట్రంలో ఆర్టీసీని ప్రభుత్వపరం చేశారని కేసీఆర్ ఇవాళ సమావేశంలో ప్రతిపక్షాల్ని అడిగినట్టుగా సీఎంవో ఇచ్చిన ప్రకటనలో పేర్కొన్నారు. ఎక్కడో వేరే రాష్ట్రాలు ఎందుకు..? ‘కలిసి మెలిసి వుందాం.. ఉమ్మడిగా సాగుదాం..’ అంటూ పది రోజులకు ఒకసారి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినైతే కేసీఆర్ కౌగిలించుకుంటున్నారో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ఆర్టీసీని ప్రభుత్వపరం చేశారని ప్రతిపక్షాలు గుర్తుచేస్తున్నాయి.