ఉక్రెయిన్ లోని బుచా నగరంలో మరణాలపై స్వత్రంత్ర దర్యాప్తు నిర్వహించాలని భద్రతా మండలిలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్. తిరుమూర్తి అన్నారు.
భద్రతా మండలిలో ఆయన మాట్లాడుతూ… ఉక్రెయిన్- రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారత్ లో ఇంధన, ఆహార ధరల పరిస్థితిపై ఆయన వివరించారు.
ఆ రెండు దేశాల యుద్ధం ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ప్రభావాన్ని చూపించిందన్నారు. శాంతి పక్షాన నిలబడుతామని మొదటి నుంచి భారత్ చెబుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
రక్తపాతం, అమాయకుల ప్రాణాలను బలిగొనడం ద్వారా సమస్యలకు పరిష్కారాలను కనుగొనలేమన్నారు. అందుకే ఇరు దేశాలు శాంతి యుతంగా చర్చించుకుని సమస్యకు పరిష్కారాన్ని కనుగోవాలని సూచించారు.
యుద్ధంలో చాలా మంది ప్రాణాలను కోల్పోయారని, ఎంతో మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రత్యేకంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. యుద్ధం వల్ల చాలా మంది నిరాశ్రయులయ్యారని పేర్కొన్నారు.
బుచా మరణాలను భారత్ తీవ్రంగా ఖండిస్తున్నట్టు వెల్లడించారు. దీనిపై స్వత్రంత్ర దర్యాప్తు చేయాలన్న వాదనకు భారత్ మద్దతు తెలుపుతున్నట్టు ఆయన వెల్లడించారు.