తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే రెండు రోజులు తేలిక పాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ రోజు వర్షం కురిసింది. ఆయా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. మరో వైపు మిగతా జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. ఈ రోజు పెద్దపల్లి జిల్లాలో అత్యధికంగా 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు మెదక్, జనగాం, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల,హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సిద్ధిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఆయా జిల్లాకు యెల్లో అలర్ట్ ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వస్తాయని చెప్పింది. శుక్రవారం ఉదయం రాష్ట్రంలో వాతావరణం పొడిగా వుంటుందని చెప్పింది. వర్షాలు కురిసే అవకాశం లేదని అంచనా వేసింది.
గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, రంగారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది.