కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాలకు నిధుల కొరత ఏర్పడింది. కుప్పులు తెప్పలుగా పేరుకుపోయిన దరఖాస్తులు, రోజు రోజుకు పెరుగుతున్న లబ్ధిదారులు ప్రభుత్వానికి కొత్త సవాళ్లు సృష్టిస్తున్నాయి. ప్రభుత్వంలోని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం లక్షా ౩౦ కోట్ల రాష్ట్ర బడ్జెట్ లో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు పథకాలకు చేసిన కేటాయింపులు సరిపోవని తెలిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత ఇష్టమైన ఈ మూడు పథకాల కోసం ప్రభుత్వానికి మరో 3000 కోట్లు అదనంగా కావాల్సి ఉంది. కళ్యాణ లక్ష్మీ పథకం కోసం దరఖాస్తు చేసే ఎస్సీ, ఎస్టీలు, బీసీల సంఖ్య ఎప్పుడూ పెరుగుతూనే ఉంది. 2016-17 లో రూ.180 కోట్లతో పథకాన్ని ప్రారంభించారు. అది 2019-20 ఆర్ధిక సంవత్సరానికి రూ14000 కోట్లకు చేరింది. లబ్ధిదారులకు ప్రభుత్వం ఇప్పటికే రూ.600 కోట్లు చెల్లించింది. బీసీ సంక్షేమ శాఖ దగ్గర ఇంకా 50 వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నవి. మరో ౩౦ వేల మంది అర్హులున్నారు. ఇప్పటికిప్పుడు కనీసం రూ.1700 కోట్లు కావాల్సి ఉంది. పథకం ఆగిపోకూడదనుకుంటే విషయాన్ని వెంటనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాల్సి వుందని అధికారులంటున్నారు. 2018-19 లో రైతు బంధు పథకం కింద ఇప్పటి వరకు రూ.5000 కోట్లు చెల్లించారు. మరో 1300 కోట్లు కావాల్సి ఉందని వ్యవసాయ శాఖ ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పుడు పెండింగ్ లో ఉన్నవందలాది భూ సమస్యలు పరిష్కరించి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేస్తే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయి. ప్రభుత్వం ఎన్ని ఆర్ధిక చర్యలు చేపట్టినప్పటికీ ఆ రెండు ప్రతిష్టాత్మక పథకాలకు మాత్రం రూ.10000 కోట్లు వెంటనే కావాల్సి ఉంది.