టీఎస్పీఎస్సీ కేసు దర్యాప్తు ముమ్మురంగా కొనసాగుతోంది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఎవరినీ వదిలిపెట్టడం లేదు సిట్. ఇప్పటికే ఈ కేసులో 37 మందిని అరెస్ట్ చేసింది. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని సిట్ భావిస్తోంది. సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేస్తోంది. తాజాగా బుధవారం డీఏఓ, ఏఈ టాపర్స్ ను సిట్ విచారించనుంది.
టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసు నిందితులు రాజశేఖర్‌రెడ్డి భార్య సుచరిత, రేణుక వదిన శాంతి, ఫ్రెండ్ రాహుల్ ను నాంపల్లి కోర్టు సిట్ కస్టడీకి అప్పగించింది. చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న సుచరిత, శాంతి, రాహుల్ ను సిట్ బుధవారం ఉదయం కస్టడీకి తీసుకోనుంది.
వారికి మెడికల్ చెకప్ లు నిర్వహించి హిమాయత్ నగర్ లోని సిట్ ఆఫీస్ కు తరలించనున్నారు. సుచరిత, శాంతి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్షలో టాప్ ర్యాంకర్స్ గా నిలిచినట్లు సిట్ గుర్తించింది. వీరితో పాటు మహబూబ్ నగర్ కు చెందిన రేణుక ఫ్రెండ్, టీచర్ రాహుల్ ఏఈ పరీక్షలో టాప్ స్కోర్ చేసినట్లు ఆధారాలు లభించాయి.
టీఎస్పీఎస్సీ డేటాబేస్, నిందితుల కాంటాక్ట్స్ ఆధారంగా ఈ ముగ్గురిని పోలీసులు గత బుధవారం అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురిని బుధవారం నుంచి శుక్రవారం వరకు అధికారులు విచారించనున్నారు. వీరి విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సిట్ భావిస్తోంది.