టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై వదంతులను నమ్మవద్దని బోర్డు చైర్మన్ జనార్ధన్ రెడ్డి కోరారు. లీకేజీ వ్యవహారంపై ఆయన ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించారు. పేపర్ లీక్ పై వస్తున్న వదంతులకు చెక్ పెట్టేందుకే తాను మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
దురదృష్టకరమైన వాతావరణంలో ప్రెస్ మీట్ పెడుతున్నానని ఆయన వాపోయారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పేపర్ మాస్ కాపీయింగ్ జరిగే అవకాశం లేదని ఆయన తేల్చి చెప్పారు. కంప్యూటర్ ను నిందితుడు ప్రవీణ్ హ్యాక్ చేసినట్టు గుర్తించామన్నారు.
రాజశేఖర్ రెడ్డి అనే నెట్వర్క్ ఎక్స్పర్ట్ 6,7 ఏండ్లుగా కార్యాలయంలో పనిచేస్తున్నారని చెప్పారు. అతనికి అన్ని ఐపీ అడ్రస్సులు తెలుసన్నారు. రాజశేఖర్ రెడ్డి ద్వారానే హక్ అయ్యిందని విచారణలో తెలుసుకున్నామన్నారు. పరీక్ష పత్రాన్ని అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ద్వారా లీక్ చేయించినట్లు గా గుర్తించామన్నారు.
వారు పేపర్ లీక్ చేసి కొందరు వ్యక్తులకు సమాచారాన్ని చేరవేశారని ఆయన వెల్లడించారు. తన కుటుంబ సభ్యులు ఎవరూ గ్రూప్-1 పరీక్ష రాయలేదని ఆయన స్పష్టం చేశారు. తన కూతురు గ్రూప్-1 రాస్తానంటే తాను వద్దనన్నారు. ఒకవేళ ఆమె గ్రూప్ వన్ రాస్తే తాను చైర్మన్ పదవిని వదులుకుంటానని ఆమెతో చెప్పినట్టు ఆయన అన్నారు.
ప్రవీణ్‌కు 103 రావడం నిజమేనని ఆయన తెలిపారు. కానీ అదే టాప్ మార్క్ కాదన్నారు. ఈ నెల 5న జరిగిన అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష పత్రం కూడా లీక్ అయినట్టు అనుమానం ఉందన్నారు. దానికి సంబంధించిన నివేదిక రేపు వస్తుందన్నారు. నివేదిక వచ్చాక తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు.
రాష్ట్రం వచ్చాక సుమారు 35 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని ఆయన చెప్పారు. ప్రస్తుతం మరో 25 వేల ఉద్యోగాల భర్తీ కొనసాగుతోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలో మల్టిపుల్ జంబ్లింగ్ చేశామన్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో ప్రశ్నలు, జవాబులు మల్టిపుల్ జంబ్లింగ్ చేశామన్నారు. పరీక్షా విధానాల్లో టీఎస్పీఎస్సీ అనేక కొత్త విధానాలు తీసుకువచ్చిందన్నారు. పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరగకూడదనే ఉద్దేశంతోనే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.
గ్రూప్- 1 కోసం ఏప్రిల్‌లో నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. అక్టోబర్‌లో పరీక్ష నిర్వహించామన్నారు. ప్రిలిమినరీ పరీక్ష ముగిసిన తర్వాత మెయిన్స్ కి కూడా 1:50 మిగిత రాష్ట్రాలతో పోలిస్తే అత్యధికంగా పిలిచామన్నారు. ఓఎంఆర్ కూడా స్కాన్ చేసి వెబ్సైట్‌లో పెట్టామన్నారు. దానితో పాటు ప్రిలిమినరీ కీ కూడా పెడతామన్నారు. మెయిన్స్‌కు ప్రిలిమ్స్ మార్కులు యాడ్ అవ్వవు కాబట్టి కట్ ఆఫ్ మార్క్స్ పెట్టబోమన్నారు.