టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ పేపర్ లీకేజీ ఘటనలో పలు కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే హనీట్రాప్ విషయం బయటికి వచ్చింది. అయితే ఇంటి దొంగలే లీకేజీకి పాల్పడి ఉంటారన్న అనుమానం నిజమైంది. కాన్ఫిడెన్షియల్ సిస్టమ్ నుంచి డేటా చోరీ చేసింది ఇంటి దొంగలేనని తేలిపోయింది. టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్, టీఎస్ టీఎస్ ఉద్యోగి రాజశేఖర్ కీలక నిందితులని పోలీసు విచారణలో వెల్లడైంది.
టీఎస్‌పీఎస్సీ సెక్రెటరీ పీఏ ప్రవీణ్.. ఓ అమ్మాయి కోసమే పేపర్ లీక్ చేశాడని గుర్తించారు. గత కొద్ది రోజులుగా ప్రవీణ్ ఓ అమ్మాయితో సన్నిహితంగా ఉంటున్నాడు. ఆ యువతి కూడా తరుచూ ప్రవీణ్ ను కలిసేందుకు ఆఫీస్ కు వచ్చేదని పలువురు చెబుతున్నారు. ఈ క్రమంలోనే సదరు యువతి తమ్ముడు పరీక్ష రాస్తుండడంతో ప్రవీణ్ ను ఆమె క్వశ్చన్ పేపర్ అడిగింది. అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ పై పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ కు ఇచ్చి.. అతని సిస్టమ్ లో లాగిన్ అయ్యారు.
ఆ సిస్టమ్ లో ప్రశ్నపత్రాన్ని డౌన్ లోడ్ చేయకుండా నేరుగా ప్రవీణ్ మొబైల్ కు పంపించుకున్నారు. ప్రవీణ్ దాన్ని ఆ యువతికి పంపించాడు. ఆ తర్వాత అమ్మాయి తమ్ముడిని పరీక్షకు ప్రిపేర్ చేశారు. ఈ క్రమంలో ఇదే విషయం యువతి తమ్ముడి ఫ్రెండ్స్ కు తెలిసింది. దీంతో వాళ్లు డబ్బులకు పేపర్ అడిగారు. అప్పుడు మొత్తం 14 లక్షలు మాట్లాడుకుని.. 4 లక్షలు యువతి తన వద్దే ఉంచుకుని.. మిగతా రూ.10 లక్షలు ప్రవీణ్ కు ఇచ్చేలా డీల్ కుదుర్చుకున్నారు.
ఆ డీల్ లో డబ్బులు ఇచ్చే దగ్గర తేడాలు రావడంతో ఓ యువకుడు డయల్ 100కు కాల్ చేసి.. పేపర్ లీక్ విషయం మొత్తం చెప్పేశాడు. దీంతో అసలు విషయాలన్నీ బయటపడ్డాయి. నిందితుల్లో మహిళ భర్త కూడా ఉన్నాడని తెలుస్తోంది. క్వశ్చన్ పేపర్ ను బహిరంగంగానే కొందరు అమ్ముతుండడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ప్రస్తుతం పోలీసులు 13 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మార్చి 12వ తేదీన జరగాల్సిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రిక్రూట్ మెంట్ ఎగ్జామ్ పేపర్ లీక్ ఆరోపణతో పరీక్షను టీఎస్ పీఎస్సీఅధికారులు వాయిదావేశారు. అలాగే ఈ నెల 15, 16వ తేదీల్లో జరిగే వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఎగ్జామ్ ను సైతం వాయిదా వేశారు.