టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే సంబంధిత నిందితులను శిక్షించాలని రాజకీయ నాయకులు, నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ పేపర్ల లీకేజీ వ్యవహారంలో మరో పేరు వెలుగులోకి వచ్చింది. కమిషన్ మాజీ ఉద్యోగి, తన స్నేహితుడైన సురేష్ కూ.. ప్రవీణ్ కుమార్ గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రం పంపినట్లు తేలింది. గ్రూప్-1 పేపర్ ను సురేష్ కు ప్రవీణ్ ఇవ్వగా.. పరీక్ష రాసి సురేష్ క్వాలిఫై అయినట్లు సిట్ అధికారులు గుర్తించారు. దీంతో మంగళవారం సురేష్ ను అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
టీఎస్పీఎస్సీలో పని చేస్తున్న 10 మంది ఉద్యోగుల వరకు గ్రూప్-1 పరీక్ష రాసినట్టు సిట్ అధికారులు గుర్తించారు. వారందరూ గ్రూప్-1 మెయిన్స్ కు క్వాలిఫై అయినట్టు సిట్ అధికారుల విచారణలో వెల్లడైంది. వారందరికీ సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి విచారించనున్నారు. ఏడుగురు రెగ్యులర్, ముగ్గురు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సిట్ నోటీసులు అందజేసింది.
కమిషన్ లోనే నెట్ వర్క్ అడ్మిన్ గా పని చేస్తున్న రాజశేఖర్ సాయంతో కస్టోడియన్ కంప్యూటర్ లో ఉన్న ఈ ప్రశ్నాపత్రాన్ని గతేడాది అక్టోబర్ తొలి వారంలో చేజిక్కించుకున్నాడు సురేష్. అలాగే ఈ కేసుకు సంబంధించి ప్రవీణ్, రాజశేఖర్ పెన్ డ్రైవ్ లను అధికారులు సీజ్ చేశారు. పెన్ డ్రైవ్ లకు కూడా ప్రవీణ్, రాజశేఖర్ పాస్ వర్డ్ పెట్టారు. రూ. 14 లక్షల నగదు ఆర్ధిక లావాదేవీలపై సిట్ ఆధారాలను సేకరించింది. రాజశేఖర్ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్, వాట్సాప్ గ్రూప్స్ లో ఉన్న వారితో జరిగిన సంప్రదింపుల వివరాలను కూడా ఆరా తీస్తున్నారు అధికారులు.
అలాగే ప్రశ్నా పత్రాలు ఇచ్చిన రేణుకకు నిలేష్, గోపాల్ ద్వారా రూ.14 లక్షల నగదు అందినట్లు అధికారులు ఆధారాలను సేకరించారు. ఇందులో ఓ లక్ష రూపాయలు కానిస్టేబుల్ శ్రీనివాస్ కు కూడా సర్దుబాటు చేసినట్లు సిట్ గుర్తించింది. నగదు ఇచ్చినందుకు అతడు సైతం ప్రశ్నాపత్రాన్ని వీరి నుంచి పొందాడా? లేక ఎవరికైనా పంపాడా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తోంది సిట్.