తెలంగాణలో 50వేల ఉద్యోగాలు భర్తీకి కట్టుబడి ఉన్నాం అంటూ ఎమ్మెల్సీ ఎన్నికల ముందు సర్కార్ పెద్దలు మాములుగా చెప్పలేదు. ఇప్పటికే లక్షకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామని, 50వేల పోస్టులు కూడా భర్తీ చేస్తామంటూ హాడావిడి చేశారు. కానీ ఆ పోస్టులన్నీ భర్తీ చేయాల్సిన తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ లోనే ఉన్న ఖాళీలను మాత్రం నింపటం లేదు. కమిషన్ లో కోరం కాదు కదా… ఒక్కరంటే ఒక్కరే ఉండటం గమనార్హం.
TSPSC ఏర్పాటయ్యాక గంటా చక్రపాణితో పాటు పలువురు సభ్యులను ప్రభుత్వం నియమించింది. కానీ వారంతా ఇప్పుడు పదవీకాలం ముగించుకొని వెళ్లిపోయారు. అందులో ఒక్కరే మిగిలారు. కోరం లేదు కాబట్టి ఉద్యోగ నియామకాలకు సర్కార్ ఓకే అన్న కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఓ రిటైర్డ్ ఐపీఎస్ ను చైర్మన్ గా నియమించనున్నారని లీకులిచ్చినప్పటికీ ఏవీ నెరవేరటం లేదు.
కమిషన్ మాత్రమే కాదు అక్కడ పనిచేసే ఉద్యోగులు కూడా అరకొరగానే ఉన్నారు. ఏపీ-తెలంగాణ విభజన తర్వాత TSPSC క్యాడర్ స్ట్రెంత్ 165. విభజన సమయంలో 128మందిని కేటాయించారు. అందులో ఉద్యోగులు రిటైర్ అయ్యాక… ఇప్పుడున్న వారు 85మంది రెగ్యూలర్ ఉద్యోగులు. కొన్ని చోట్ల ఔట్ సోర్సింగ్ పద్ధతిలో కాలం వెల్లదీస్తున్నా… తమకు ఉద్యోగులను కేటాయించండి అంటూ TSPSC 150మంది ఉద్యోగుల కోసం ప్రభుత్వానికి లెటర్ పెట్టింది. కానీ సర్కార్ పట్టించుకోలేదు. ఆ తర్వాత 95మంది అయినా సరే వెంటనే కేటాయించండని కోరింది. అయినా నో రెస్పాన్స్. చివరకు కమిషన్ మరింత దిగొచ్చి… 60మందిని అయినా ఇవ్వండి, పనిచేయించలేకపోతున్నాం అని ప్రభుత్వానికి మొరపెట్టుకుంది.
ఓవైపు కమిషన్ సభ్యులు లేక, కమిషన్ లో పనిచేసేందుకు సరిపడా ఉద్యోగులు లేక… సర్కార్ పోస్టుల భర్తీ ఎలా చేస్తుందన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.