తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కార్యాలయంలోని ఓ కంప్యూటర్ హ్యాక్ అయింది. ఆ కంప్యూటర్ లోని పలు పరీక్షా పేపర్స్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. దీంతో టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ హ్యాకింగ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది టీఎస్పీఎస్సీ.
ఈ ఘటనలో ఇప్పటికే ఇద్దరు నిందితులను బేగం బజార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు టీఎస్పీఎస్సీ సిబ్బంది పాత్రపై కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కీలకమైన హోదాల్లో ఉన్న అధికారుల వద్ద లాగిన్ వివరాలు ఉంటాయి. ఈ విషయాలు ఎలా లీక్ అయ్యాయి? ఎవరు లాగిన్ అయ్యారు? ఎందుకు అయ్యారు? అనే దిశగా పోలీసుల దర్యాప్తు చేపడుతున్నారు.
కాగా టీఎస్పీఎస్సీలోని కంప్యూటర్ల నుంచి అత్యంత రహస్యమైన సమాచారం లీక్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు పరీక్షలను వాయిదా వేశారు అధికారులు. దీంతో ఆదివారం జరగాల్సిన టౌన్ ప్లానింగ్ పరీక్ష వాయిదా పడింది.
అలాగే మార్చి 15, 16వ తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షను సైతం వాయిదా వేసినట్లు చెప్పారు టీఎస్పీఎస్సీ అధికారులు. వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు పేర్కొన్నారు.