TSPSC ప్రశ్నాపత్రం లీక్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయట పడుతున్నాయి. ఈ కేసుపై సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. పలు కీలక విషయాలను రాబడుతున్నారు. తాజాగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ కేవలం ఐదుగురికి మాత్రమే చేరి ఉండొచ్చని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్ ను ప్రశ్నించినప్పుడు ఐదు పేర్లు మాత్రమే బయటపడ్డాయి.
దొంగతనంగా శంకర్ లక్ష్మి దగ్గర నుంచి పాస్ వర్డ్ తెలుసుకుని.. కంప్యూటర్ లో డేటా చోరీ చేసినట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. టీఎస్పీఎస్సీ ఏఎస్ఓగా పని చేస్తున్న ప్రవీణ్ తన కోసమే గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రాన్ని లీక్ చేశాడని.. ఆ తర్వాత తన సహోద్యోగులైన షమీమ్, రమేష్ తో పాటు సురేష్ కు ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. అలాగే రాజశేఖర్ రెడ్డి తన బావ ప్రశాంత్ రెడ్డికి కూడా గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రాన్ని అందించాడని సిట్ అధికారులు గుర్తించారు.
నిందితులను రెండు సార్లు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించినా ఈ విషయంలో ఐదుగురు పేర్లే బయటికి వచ్చాయని, ఆపై ఎన్ని సార్లు అడిగినా నిందితులు నోరు విప్పడం లేదని సిట్ అధికారులు చెబుతున్నారు. అయితే క్వశ్చన్ పేపర్స్ ఆ గ్రూపు వరకే పరిమితమయ్యాయా లేక మిగతా వారికి షేర్ అయ్యాయా.. అనే కోణంలో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇక ఏఈ ప్రశ్నాపత్రం మాత్రం 12 మందికి చేరినట్లు సిట్ అధికారులు గుర్తించారు. డాక్యా, రాజేశ్వర్ నాయక్ కలిసి పలువురికి విక్రయించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఏఈ ప్రశ్నాపత్రం కొనుగోలు చేసి పరీక్ష రాసిన నలుగురు అభ్యర్థులను.. ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మిగతా 8 మంది ఎవరనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటివరకూ గ్రూప్-1 పరీక్ష రాసి 100కు పైగా మార్కులు సాధించిన 121 మందిలో ఇప్పటికే 84 మందిని ప్రశ్నించారు సిట్ అధికారులు.
కొత్త పరీక్ష తేదీలను ప్రకటించిన టీఎస్పీఎస్సీ:
పేపర్ల లీక్ నేపథ్యంలో రద్దు చేసిన ఏఈఈ నియామక పరీక్షల కొత్త తేదీలను ప్రకటించింది టీఎస్పీఎస్సీ. మే 8వ తేదీన ఏఈఈ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ పరీక్షలు, మే 9న అగ్రికల్చర్, మెకానికల్ ఏఈఈ పరీక్షలను ఆన్ లైన్ లో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ బుధవారం వెల్లడించింది. ఇక మే 21వ తేదీన సివిల్ ఏఈఈ ఓఎంఆర్ పరీక్షను నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది.