తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఏఈ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ విషయంలో రోజుకో కొత్తకోణం వెలుగులోకి వస్తోంది. తవ్వేకొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి.
ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్న సిట్ అధికారులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఏఈ పరీక్షలోనూ నిందితుడు ప్రవీణ్ కీలకంగా వ్యవహరించాడని గుర్తించారు.
ఒక ఎగ్జామ్ సెంటర్ కు ప్రవీణ్ వెళ్లినట్లు సిట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏఈ పరీక్ష జరిగిన మార్చి 5వ తేదీన స్వ్కాడ్ గా ప్రవీణ్ వెళ్లినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. స్వ్కాడ్ గా వెళ్లి ఓ మహిళా అభ్యర్థికి ‘కీ’ పేపర్ ఇచ్చినట్లు అనుమానిస్తున్నారు.
ప్రవీణ్ మొత్తం ఎన్ని పేపర్లు లీక్ చేశాడనే కోణంలోనూ సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీలో ఉన్న సిబ్బంది నెట్ వర్క్ సెక్షన్ ను అధికారులు పూర్తిగా పరిశీలించారు. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన తొమ్మిది మందే కాకుండా మరికొంతమంది సైతం ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.