తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన TSPSC పేపర్ లీక్ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను సిట్ కస్టడీలోకి తీసుకుంది. ఏ1 ప్రవీణ్, ఏ2 రాజశేఖర్, ఏ4 ఢాక్యా నాయక్, ఏ5 రాజేశ్వర్ లను మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతించింది కోర్టు. శనివారం పేపర్ లీకేజ్ కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. నలుగురు నిందితులను 3 రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఆదివారం నుంచి మంగళవారం వరకు నిందితులను సిట్ విచారించనుంది.
ఇప్పటికే నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించిన సిట్ అధికారులు.. లోతైన విచారణ కోసం మరో మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతించాలని కోర్టును ఆశ్రయించారు. టీఎస్పీఎస్సీ కేసులో పోలీసులు 9 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే.
అయితే ఈ కేసులో పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగించిన అనంతరం సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్న మరో ముగ్గురిని కూడా కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏ10 షమీమ్, ఏ11 సురేష్, ఏ12 రమేష్ కస్టడీ పిటిషన్ ను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో మొత్తం 19మంది సాక్ష్యులను సిట్ విచారించింది.
కాగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరొకరిని అదుపులోకి తీసుకుంది సిట్. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రశాంత్ అనే వ్యక్తిని సిట్ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఉపాధి హామీ విభాగంలో పని చేస్తున్న అతనిని సిట్ బృందం విచారించింది. రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన సమాచారంతో.. అతని బావ అయిన ప్రశాంత్ గ్రూప్-1 పరీక్ష రాసి 100కు పైగా మార్కులు తెచ్చుకున్నారని దర్యాప్తులో తేలింది.