టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే పేపర్ల లీకేజీ వ్యవహారంలో కమిషన్ మాజీ ఉద్యోగి సురేష్ పేరు బయటకు వచ్చింది. దీంతో మంగళవారం సురేష్ ను అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా టీఎస్పీఎస్సీలో పని చేస్తోన్న 42 మంది ఉద్యోగులకు సిట్ నోటీసులు జారీ చేసింది. టీఎస్పీఎస్సీ ఔట్ సోర్సింగ్ ఐటీ సిబ్బందికి నోటీసులు ఇచ్చింది సిట్.
ఈ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ లతో సన్నిహితంగా ఉన్నవారిపై సిట్ ఫోకస్ పెంచింది. ఇందులో భాగంగానే తాజాగా సిట్ పలువురు ఉద్యోగులు, అభ్యర్థులకు నోటీసులు జారీ చేసింది. కమిషన్ లో పని చేస్తోన్న 10 మంది గ్రూప్-1 పరీక్ష రాసినట్టు సిట్ అధికారులు గుర్తించారు. వారందరూ గ్రూప్-1 మెయిన్స్ కు క్వాలిఫై అయినట్టు సిట్ అధికారుల విచారణలో వెల్లడైంది. వారందరికీ సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి విచారించనున్నారు. అంతేకాకుండా కాన్ఫిడెన్షియల్ రూమ్ ఇన్ ఛార్జ్ గా ఉన్న శంకరలక్ష్మీ పాత్రపై మరింత దర్యాప్తు చేయాలని సిట్ నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే శంకరలక్ష్మీని ఓసారి విచారించిన సిట్.. గురువారం మరోసారి ఆమె స్టేట్ మెంట్ ను రికార్డ్ చేయనుంది. ఈ కేసులో కీలకంగా ఉన్న నిందితురాలు రేణుకతో టచ్ లో ఉన్న కోచింగ్ సెంటర్ నిర్వాహకులు.. అభ్యర్థులను కూడా విచారించేందుకు సిట్ సిద్ధమయ్యింది. అలాగే నిందితుడు రాజశేఖర్ స్నేహితుడు సురేష్ పాత్రపై కూడా సిట్ అధికారులు విచారణ చేయనున్నారు.
ఇక ఈ కేసుకు సంబంధించి ప్రవీణ్, రాజశేఖర్ పెన్ డ్రైవ్ లను అధికారులు సీజ్ చేశారు. పెన్ డ్రైవ్ లకు కూడా ప్రవీణ్, రాజశేఖర్ పాస్ వర్డ్ పెట్టారు. రూ. 14 లక్షల నగదు ఆర్ధిక లావాదేవీలపై సిట్ ఆధారాలను సేకరించింది. రాజశేఖర్ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్, వాట్సాప్ గ్రూప్స్ లో ఉన్న వారితో జరిగిన సంప్రదింపుల వివరాలను కూడా ఆరా తీస్తున్నారు అధికారులు.