టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీల కేసుపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయవాది వివేక్ థన్కా వాదనలు వినిపించారు. ఈ కేసు లక్షలాది మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించిందని ఆయన అన్నారు.
ఓ వైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, అదే సమయంలో ఇద్దరు మాత్రమే నిందితులంటూ ఐటీ మంత్రి చెబుతున్నారని పేర్కొన్నారు. ఇందులో కుట్ర కోణం దాగి ఉందని ఆయన వాదనలు వినిపించారు. ఒకే మండలంలో 20 మందికి మంచి మార్కులు వచ్చాయని ఆయన తెలిపారు.
దీనిపై కూడా పలు అనుమానాలు వస్తున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు ఏఈ, గ్రూప్ 1, ఏఈఈ, డీఏవో పరీక్షలను టీఎస్పీఎస్సీ బోర్డు రద్దు చేసిందని వెల్లడించారు. సిట్ దర్యాప్తు కన్నా సీబీఐతో దర్యాప్తు చేయిస్తే అసలు దోషులు బయటకు వస్తారని ఆయన వాదించారు.
ఇక్కడి పోలీసులపై నమ్మకం లేదన్నారు. సీబీఐతో దర్యాప్తు చేయిస్తే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన అన్నారు. అందువల్ల విచారణను సీబీఐకి అప్పగించాలని ఆయన కోరారు. క్వాలిఫై అయిన అభ్యర్థుల వివరాలను టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్ సైట్లో ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు.
అభ్యర్థుల వివరాలు అంత రహస్యంగా టీఎస్పీఎస్పీ ఎందుకు ఉంచుతోందని ఆయన అడిగారు. గతంలో వ్యాపమ్ కుంభకోణంలో దర్యాప్తును సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించిందన్నారు. మధ్యప్రదేశ్ వ్యాపమ్ స్కాం జడ్జిమెంట్ కాపీని వివేక్ థన్క హైకోర్టుకు అందించారు.
బలమూరి వెంకట్, ఓయూ విద్యార్థులు ఉద్దేశ పూర్వకంగానే న్యాయస్థానంలో పిటిషన్, అఫిడవిట్ దాఖలు చేశారని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బీఎన్ ప్రసాద్ వాదనలు వినిపించారు. ఇప్పటి వరకు ఈ కేసులో 9 మందిని అరెస్ట్ చేశారని ఆయన కోర్టుకు తెలిపారు. కానీ కేవలం ఇద్దరే అరెస్టయ్యారని పిటిషనర్లు అంటున్నారని చెప్పారు.
టీఎస్పీఎస్సీ బోర్డుకు చెందిన ఇద్దరితో పాటు మిగిలిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. రాజకీయ దురుద్దేశంతో వేసిన పిటిషన్ ఇది అని ఆయన కోర్టుకు చెప్పారు. పిటిషనర్‌కు లోకస్ స్టాండీ లేదని విచారణ అర్హత లేదన్నారు. లీకేజీలో కేసులో సిట్ సమగ్ర దర్యాప్తు జరుపుతోందన్నారు.
వాదనలు విన్న హైకోర్టు ఈ కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తు వివరాలు న్యాయస్థానానికి సమర్పించాల్సిందిగా ఏజీని కోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను ఏప్రిల్ 11కు కోర్టు వాయిదా వేసింది. మరోవైపు కోర్టు విచారణ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా న్యాయస్థానానికి హాజరు కావడం గమనార్హం.