– తెలంగాణలో కుదిపేస్తున్న టీఎస్పీఎస్సీ పేపర్స్ లీక్
– ప్రవీణ్ సెల్ లో గ్రూప్ 1 పేపర్?
– ఫోరెన్సిక్ నివేదికకు నిందితుల ఫోన్స్
– ఆందోళన బాటలో అభ్యర్థులు.. విద్యార్థి సంఘాలు
– టీఎస్పీఎస్సీ తీరుపై ప్రతిపక్షాల ఆగ్రహం
– పేపర్ల లీకేజీపై అదనపు సీపీ వివరణ
క్రైంబ్యూరో, తొలివెలుగు:నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ప్రత్యేక తెలంగాణ సాకారమైంది. అయితే.. నియామకాల విషయంలో మొదట్నుంచి ఏదో ఒక లొల్లి జరుగుతూనే ఉంది. తాజాగా టీఎస్పీఎస్సీ పేపర్స్ లీక్ సంచలనంగా మారింది. తవ్వేకొద్దీ ఈ వ్యవహారంలో ఎన్నో విషయాలు బయటకొస్తున్నాయి. మార్చి 11న తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిస్టమ్స్ హ్యాక్ కి గురయ్యాయని వార్తలు వచ్చాయి. అంత ఈజీగా ఎలా జరిగిందని దర్యాప్తు మొదలు పెడితే.. ఓ అమ్మాయి కోసం హానీ ట్రాప్ లో పడి పేపర్స్ లీక్ చేసినట్లు గుర్తించారు. దీంతో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్షలో మూడు పేపర్స్ ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటన వచ్చింది. కానీ, పోలీసుల దర్యాప్తులో ఈనెల 5న జరిగిన ఏఈ పశ్నా పత్రాలు కూడా లీక్ అయినట్లు గుర్తించారు. సెక్రెటరీ పీఏ ప్రవీణ్ కుమార్ తో పాటు రాజశేఖర్ అనే వ్యక్తిని విధుల నుంచి తొలగించారు.
ఇప్పుడు 833 అసిస్టెంట్ ఇంజనీరింగ్ , టెక్నికల్ ఆఫీసర్స్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రవీణ్, రాజశేఖర్ లు ఇద్దరూ 2017లో నెట్ వర్క్ ఎక్స్ పర్ట్స్ గా జాయిన్ అయ్యారు. ఇద్దరూ కలిసి డేటాను పెన్ డ్రైవ్ లో పెట్టుకున్నారు. రేణుక అనే యువతికి 5 లక్షలు తీసుకుని డేటా ఇచ్చారు. దాక్యా నాయక్ కి మరో 5 లక్షలు తీసుకుని ఇచ్చారు. ఏఈ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న రాజేశ్వర్ నాయక్ , కేతావత్ శ్రీనుతో కలిసి నీలేశ్ నాయక్, గోపాల్ నాయక్ కి 13 లక్షలకు అమ్మేశారు. ఎవరికీ అనుమానం రాకుండా అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. అయితే.. డబ్బుల విషయంలో తేడాలు రావడంతో డయల్ 100కి ఫోన్ చేసి మొత్తం చెప్పారు. దీంతో 9 మందిని అరెస్ట్ చేశారు. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలు కూడా లీక్ అయ్యాయి. ఇలా ఈ లీకుల వ్యవహారం గ్రూప్-1 పై పడింది.
ఫోన్స్ లో డిలీట్ చేసిందేంటి?
టీఎస్పీఎస్సీ ముందు వేలాది మంది విద్యార్ధులు ఆందోళనకు దిగారు. సెక్రెటరీని సస్పెండ్ చేసి.. సీబీఐతో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1 పేపర్ కూడా లీక్ అయి ఉంటుందని ఆరోపించారు. ప్రవీణ్ ఫోన్ లో గ్రూప్-1 పేపర్స్ ఉన్నాయని అంటున్నారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇవి వచ్చాయా.. అంతకంటే ముందే ఎవరికైనా లీక్ చేశాడా అనేది విచారణలో తేలనుంది. ఇప్పుడు మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు గుబులు పట్టుకుంది. ఇలా నిర్లక్ష్యంగా ఉంటే తమకు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయని ప్రశ్నిస్తున్నారు.
ఎన్నో లీకులు.. మారని తీరు!
తెలంగాణ రాగానే ఎంసెట్ పేపర్ లీకేజీ కుంభకోణం వెలుగుచూసింది. విద్యార్థులను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి లీకైన పేపర్స్ ప్రిపేర్ చేయించి తీసుకొచ్చారు. ఈ వ్యవహారంలో నారాయణ, శ్రీచైతన్య కాలేజీలపై ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఇలా జరుగుతున్నాయని సీఐడీ స్పెషల్ టీం గుర్తించింది. ఎన్నో ట్విస్టుల తర్వాత ఈ కేసు ఇప్పటికీ కొలిక్కి రాలేదు. ప్రధాన నిందితుడు ఆత్మహత్య చేసుకోవడంతో చార్జిషీట్ దాఖలు చేసినా.. కోర్టులో విచారణ కొనసాగుతూనే ఉంది. పోలీస్ పరీక్షల్లో రిజర్వేషన్, హైట్ విధానం, సింగరేణి పరీక్షలో పేపర్ లీక్.. ఇలా ఏ డిపార్ట్ మెంట్ అయినా వివాదాలతో కొలువులు వచ్చాయి. హైకోర్టులో ప్రతీ పరీక్షపై కేసులు నడిచాయి. మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పోస్టుల వద్ద నుంచి మండల స్టాటిక్స్ ఆఫీసర్స్ వరకు కోర్టు తీర్పులతోనే ఉద్యోగాలు రావడంతో విమర్శలు ఎదురవుతున్నాయి.
ప్రభుత్వం సీరియస్
తాజా వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దీనిపై వివరణ ఇవ్వాలని టీఎస్పీఎస్సీ ఉన్నతాధికారులను కోరింది. ఈ నేపథ్యంలో సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్ధన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. మరోవైపు గ్రూప్-1 ప్రిలిమ్స్ లీక్ పై ఎలాంటి ఫిర్యాదు రాలేదని అదనపు సీపీ విక్రమ్ సింగ్ వివరణ ఇచ్చారు. వివిధ కోణాల్లో లీకేజీ కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ప్రవీణ్ తో పాటు 9 మందిని అరెస్ట్ చేశామని వివరించారు విక్రమ్ సింగ్