టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో విచారణ వేగవంతమైంది. అంతే కాదు ఈ విచారణ క్రమంలో కేసు ఊహించని ఎన్నో మలుపులు తిరుగుతోంది. ముందుగా అభియోగాలు ఎదుర్కొన్న టీఎస్పీఎస్సీ ఉద్యోగులను విచారించిన సిట్ అధికారులు క్రమంగా టీఎస్పీఎస్సీ పెద్ద తలకాయలను ఇంటరాగేట్ చేయడం మొదలు పెట్టారు.. దీంతో కీలక సమాచారం బయటపడుతుంది.
ఈ క్రమంలో శనివారం టీఎస్పీఎస్సీ సెక్రెటరీ అనితా రామచంద్రన్ తో పాటు సభ్యుడు లింగా రెడ్డిలను సిట్ అధికారులు విచారించారు. ముందు ఉదయం అనితా రామచంద్రన్ ను విచారించి ఆమె స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. అయితే ప్రవీణ్ గ్రూప్ 1 పరీక్ష రాసినట్టు తనకు తెలుసు కాని అతను డిస్ క్వాలిఫై కావడంతో అతని పై అనుమానం రాలేదని ఆమె విచారణలో చెప్పినట్టు సమాచారం.
ఇక ఆమె తరువాత మధ్యాహ్నం నుంచి సభ్యుడు లింగారెడ్డిని అధికారులు విచారించారు. అయితే తన పీఏ రమేశ్ గ్రూప్ 1 ఎగ్జామ్ రాసినట్టు తనకు తెలియదని లింగారెడ్డి చెప్పారు. అనితా రామచంద్రన్, లింగా రెడ్డిలను సిట్ వేరు వేరుగా రెండు గంటల పాటు విచారించింది. అయితే పరీక్షల నిర్వహణ, కాన్ఫిడేన్సియల్ పై సిట్ అధికారులు వీరి దగ్గర్నుంచి అన్నీ వివరాలు తీసుకున్నారు.
ఇక ప్రధాన నిందితులు ప్రవీణ్, రమేశ్, షమీమ్ ఇచ్చిన స్టేట్ మెంట్స్ ను ఆధారంగా చేసుకొని కార్యదర్శి అనితా రామచంద్రన్ ఇంకా సభ్యుడు లింగారెడ్డిలను సిట్ అధికారులు విచారించడం జరిగింది. మరో వైపు ఈ రోజు ముగ్గురు నిందితులను విచారించి తరవాత వారిని చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు.