నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో.. పంట భూములకు నీళ్లు, సామాన్యులకు నిధులు, నిరుద్యోగులకు నియామకాలు.. ఇలా ఏ ఒక్కటి నెరవేరలేదు. గడిచిన 9 ఏళ్లలో అనేక ఇబ్బందులను చవిచూశామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఎన్నో ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు భారీగా ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 81,000 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ రంగం సిద్దం చేస్తోంది.
ఇక ఇదే సమయంలో వయోపరిమితి వషయంలో జరుగుతున్న చర్చకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. పోలీస్ శాఖ వంటి యూనిఫాం సర్వీసులు మినహాయించి.. ఇతర ప్రత్యక్ష నియామకాల గరిష్ట వయోపరిమితిని 10 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని అధికారులు వెల్లడించారు.
ఈ మేరకు ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అన్ని శాఖల నుంచి ఖాళీల వివరాలను తీసుకునే పనిలో అధికారులు బిజీ అయ్యారు. ఈ వయోపరిమితి సడలింపుపై పూర్తిస్థాయి క్లారిటీ వచ్చిన వెంటనే నోటిఫికేషన్ వెలువడుతోందని అధికార వర్గాలు తెలిపాయి. అందుకోసం సవరణలు చేసిన ప్రతిపాదనను ఆమోదం కోసం సీఎం కేసీఆర్ వద్దకు పంపించినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఓబీసీలకు 34 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ బీసీలకు 39 సంవత్సరాలు, దివ్యాంగులకు 44 సంవత్సరాలు వయో పరిమితి గా ఉంది. గరిష్ట వయోపరిమితిని పదేళ్లకు పెంచాలని భావిస్తున్నట్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. ఒకవేళ అదే జరిగితే ఓబీసీలకు 44 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్ల వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. మరి సీఎం కేసీఆర్ ఏం ఫైనల్ చేస్తారన్నది నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం.