ప్రస్తుతం ఇప్పుడున్న రోజుల్లో సైబర్ సెక్యూరిటీ ఎంత బలంగా ఉన్నా కూడా తరుచూ పలు సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అవుతూనే ఉన్నాయి. ప్రముఖ వ్యక్తులకు, సంస్థలకు సంబంధించిన అకౌంట్లు కూడా దీనికి అతీతమేమీ కాదు. తాజాగా ఇందులోకి టీఎస్ఆర్టీసీ కూడా చేరింది.
ఆదివారం రాత్రి 9.30 టీఎస్ఆర్టీసీ @tsrtcmdoffice ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయినట్లు ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. దీనిపై టీఎస్ఆర్టీసీ సంస్థ రియాక్ట్ అయింది. అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ దురదృష్టకర సంఘటన జరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది.
సమస్యను పరిష్కరించడానికి ట్విట్టర్ తో కలిసి మాట్లాడామని.. సోమవారం తెల్లవారుజామున సమస్య పరిష్కారం అయిందని తెలిపింది. ప్రస్తుతం ఆర్టీసీ ట్విట్టర్ ఖాతా యాధావిధిగా పని చేస్తుందని స్పష్టం చేసింది.
బీఆర్ఎస్ నేత ట్విట్టర్ హ్యాక్
అలాగే బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఫేస్‌బుక్ అకౌంట్ కూడా హ్యాక్ గురైంది. గతరాత్రి ఖాతా హ్యాక్ అయినట్లు గుర్తించిన ఎంపీ.. సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరుతో వచ్చే పోస్టులు, మెసేజ్ లకు స్పందించొద్దని ట్విట్టర్ ద్వారా ఎంపీ విజ్ఞప్తి చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.