ఆర్టీసీ బస్సులో ఉరేసుకుని కండక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటన తొర్రూర్ ఆర్టీసీ డిపోలో ఆదివారం చోటు చేసుకుంది. తొర్రూరు మండలం కంఠాయపాలెం గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి ఆదివారం ఉదయం డ్యూటీకి వచ్చాడు. సెక్యూరిటీ రిజిస్టర్ లో సంతకంపెట్టి డిపోలోకి వెళ్లాడు. అలా వెళ్లిన వ్యక్తి ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది వెళ్లి పరీశిలించగా.. బస్సులో విగతజీవిగా కనిపించాడు.
ఈ సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కన్నీటిపర్యంతమయ్యారు. మృతుడి ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
ఆర్టీసీ అధికారుల ఒత్తిడి వల్లే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నారని మృతుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. కండక్టర్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనపై తొర్రూర్ ఆర్టీసీ సిబ్బందితోపాటు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహేందర్ రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలపై వేగంగా విచారణ జరపాలని కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.