సొంత రాష్ట్రం కోసం జరిగిన కొట్లాటలో ముందున్నాం. ఉద్యమ సంస్థగా మీరు ఏ పిలుపిచ్చినా… ప్రభుత్వరంగ సంస్థలో ఉండైనా కొట్లాడాం. ఉద్యోగాలు పోతాయ్ అని భయపెట్టినా… గుండె నిబ్బరంతో, జన్మభూమి కోసం మీ అండతో నడిచాం. ఇప్పుడు స్వరాష్ట్రం వచ్చింది. మా ముఖ్యమైన డిమాండ్ పక్కనపెడితె ఎలా అంటూ ఆర్టీసీ కార్మికులు కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్రం దివాలా తీసింది, అప్పుల్లో కురుకపోయిందని చెప్పే ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. కానీ మిగులు బడ్జేట్‌తో మొదలైన మన రాష్ట్రంలో మమ్మల్ని ఎందుకు ప్రభుత్వంలో కలపరు, మేము ఈ రాష్ట్రం బిడ్డలమే కదా, మేమూ మీతో పోరాటంలో ఉన్నవాళ్లమే కదా… అంటూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆ యూనియన్, ఈ యూనియన్ అన్న తేడా లేకుండా అంతా ఒక్కటై పోరాటం మొదలుపెట్టారు.
తెలంగాణ వచ్చాక పోరాడి ఫిట్‌మెంట్ సాధించుకున్నాం, కానీ రోజురోజుకు దివాళా తీస్తున్న ఆర్టీసీని మాత్రం ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఓవైపు పెరిగిపోతున్న అప్పులు, మరోవైపు గుదిబండలా వస్తున్న నష్టాలు సంస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కేసీఆర్ మాకు గతంలో ఇచ్చిన హమీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే. లేదంటే మెరుపు సమ్మెకు సిద్ధం అని ఉద్యోగ సంఘాలు తెగేసి చెప్తున్నాయి.
అయితే, ఆర్టీసీ సహా రవాణా శాఖ మాత్రం సమ్మెకు దిగినప్పుడు చర్చలకు పిలువొచ్చులే అన్నట్లు ఉండిపోయింది. పైగా దసరా పండుగ నేపథ్యంలో ఎక్కెడెక్కడ స్పెషల్ బస్సులు నడుపాలి, ఎక్కడ నుండి నడపాలి… ఎన్ని స్పెషల్ బస్సులు వేయాలి అని లెక్కలు వేసుకుంటూ ప్రకటనలు ఇస్తుండటంతో కార్మికులకు పుండుమీద కారం చల్లినట్లవుతోంది. దీంతో దసరాకు ముందే సమ్మెకు దిగే ఆలోచనలో ఉన్నారు ఆర్టీసీ కార్మికులు. అదే జరిగితే… ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రజా రవాణాలో కీలకమైందే ఆర్టీసీ. పైగా దసరా… దాదాపు తెలంగాణలో జనం అంతా సొంత ఊర్లకు వేళ్లేందుకు రెడీ అవుతుంటారు. ఇలాంటి టైంలో… ఆర్టీసీ సమ్మెను కేసీఆర్, కొత్త మంత్రి పువ్వాడ ఎలా హ్యండిల్ చేస్తారు అన్నది కీలకంగా మారగా… ఆర్టీసీ సంఘాలు ఇప్పుడున్నట్లే గట్టిగా ఉండి తమ కలల డిమాండ్‌ను సాధించుకుంటాయా, లేక ఎప్పట్లాగే…తమలో తామే కీచులాడుకొని మరోసారి వాయిదా వేస్తాయో చూడాలి.