హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది టీఎస్ఆర్టీసీ. ఆదివారం గ్రేటర్ హైదరాబాద్ జోన్ అధికారులతో టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా బస్సు సర్వీసులను నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నగర శివార్లకు మరిన్ని ట్రిప్పులు నడుపుతామని ఆయన స్పష్టం చేశారు.
ఈ విద్యా సంవత్సరం చివరి నాటికి 500 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అందులోనూ బాలికల కోసం ప్రత్యేక బస్సు సేవలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బస్సుల్లో రద్దీని తగ్గించేందుకు ట్రిప్పుల సంఖ్యను పెంచాలని సజ్జనార్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు సురక్షితమైన రవాణా సౌకర్యాలను కల్పించడం టీఎస్ఆర్టీసీ సామాజిక బాధ్యత అని ఆయన సూచించారు.
ఇబ్రహీంపట్నం క్లస్టర్ లో రద్దీ ఎక్కువగా ఉంటుందని, ప్రయాణికుల్లో ఎక్కువ మంది విద్యార్థులేనని తెలుసుకున్నామన్నారు. ఆ ఒక కారిడార్ లో దాదాపు 44 వేల మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నట్లు చెప్పారు సజ్జనార్. ఈ విద్యార్థులకు సేవ చేయడానికి, గత వారంలో మేము ఈ కారిడార్ మరో 8 ట్రిప్పులను జోడించామన్నారు.
ఈ కారిడార్ లోనే మరో 30 ట్రిప్పులు వేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. అవసరమైతే బస్సుల సంఖ్యను కూడా పెంచుతామన్నారు. చాలా మంది విద్యార్థులు కావాలని ఫుట్ బోర్డ్ పై ప్రయాణిస్తున్నారని.. అది చాలా ప్రమాదకరమని చెప్పారు. విద్యార్థులు ఫుట్ బోర్డ్ పై ప్రయాణించవద్దని, ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని కోరారు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్.