ప్రజలకు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. శుక్రవారం మెట్రో షాక్ ఇస్తే.. శనివారం టీఎస్ఆర్టీసీ మరో షాక్ ఇచ్చింది. టీఎస్ఆర్టీసీ కూడా సైలెంట్ గా చార్జీలు పెంచేసింది. దీంతో సామాన్యుడిపై ఇప్పుడు మరింత భారం పడనుంది. కేంద్రం టోల్ చార్జీలను పెంచడంతో దానికి అనుగుణంగా టీఎస్ఆర్టీసీ కూడా టికెట్ ధరలను పెంచింది. ఒక్కో టోల్ తో రూ.5 నుంచి అదనంగా టికెట్ చార్జీలు వసూలు చేస్తోంది. కొన్ని బస్సులకి రూ.10 చొప్పున పెంపు చేసింది. అదనపు టోల్ కి.. అదనపు చార్జ్ ఉండనుంది.
ముందస్తుగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా.. ఏకంగా బస్ భవన్ నుండి వాట్సాప్ ద్వారా ఆర్టీసి ఉద్యోగులకు సమాచారం ఇచ్చి ఆర్టీసీ చార్జీలు పెంచండంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు ముందస్తు ప్రకటన చేయకుండా టీఎస్ఆర్టీసీ చార్జీలను పెంచడంపై ప్రయాణికులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
కాగా అగనంపూడి టోల్ గేటు వద్ద శనివారం నుంచే పెంచిన ఫీజులను వసూలు చేసేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. గతంతో పోలిస్తే ఐదు శాతంపైగా ఫీజులను పెంచుతున్నట్టు NHAI తెలిపింది. ప్రస్తుతం ఉన్న రేట్లకు కార్లు, జీపులకు అదనంగా రూ.5 నుంచి రూ.10 వరకు పెంచారు.
అలాగే బస్సులు, లారీలకు రూ.15 నుంచి రూ.25 వరకు, భారీ వాహనాలకు రూ.40 నుంచి రూ.50 వరకు టోల్ ఫీజు పెరిగింది. నెలవారీ జారీచేసే పాస్ ధరలను కూడా పెంచుతూ ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
అయితే టోల్ చార్జీల పెంపు వల్ల తెలంగాణ ప్రజలపై అదనపు భారం పడుతుందని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీకి.. తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. గడిచిన 9 ఏళ్లలో టోల్ చార్జీలు వసూలు 300 శాతం పెంచారని అందులో లేఖలో పేర్కొన్నారు.