టీఎస్ ఆర్టీసీ కొత్తగా మరో వ్యాపారాన్ని ప్రారంభించింది. ఇప్పటికే పెట్రోల్ బంకులు, లాజిస్టిక్ బిజినెస్‌లో టీఎస్ఆర్టీసీ సక్సెస్ అయింది. తాజాగా డ్రికింగ్ వాటర్ బిజినెస్‌లోకి ఎంటర్ అయింది. ఈ మేరకు జీవా డ్రింకింగ్ వాటర్ బాటిల్స్‌ను ఆర్టీసీ ఈ రోజు ప్రారంభించింది.
హైదరాబాద్ లోని మహాత్మ గాంధీ బస్ స్టేషన్‌లో ఆర్టీసీ జీవా వాటర్ బాటిల్స్‌ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రారంభించారు. ఆర్టీసీ ప్రతి ఏడాది 90లక్షల నీటిని కొనుగోలు చేస్తోందని మంత్రి తెలిపారు. అందుకే ఇప్పటి నుంచి సొంతంగా తయారు చేసుకున్న జీవానే ఉపయోగించనున్నట్టు చెప్పారు.
కరోనా మహమ్మారి వల్ల ఆర్టీసీ తీవ్ర నష్టాలను ఎదుర్కొందన్నారు. ఆర్టీసీ ఇప్పటి వరకు ప్రయాణికులకు తీసుకునే టిక్కెట్లే ప్రధాన ఆదాయ వనరుగా ఉందన్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి బడ్జెట్‌లో 15వందల కోట్ల రూపాయలను కేటాయించినట్టు పేర్కొన్నారు.
వాటర్ బాటిల్స్ ద్వారా ఆర్టీసీ కొంత వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతానికి లీటర్ బాటిళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. త్వరలోనే 250, 500 మిల్లీలీటర్ల బాటిల్స్ ను ఉత్పత్తి చేస్తామని వెల్లడించారు. కేంద్రం డీజిల్ ధరలను పెంచడంతో సంస్థ భారం పడుతోందన్నారు.