హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు నడపడంపై ఆర్టీసీ పునరాలోచనలో పడినట్టుగా కనిపిస్తోంది. లక్షల రూపాయలు ఖర్చుపెట్టి అందుబాటులోకి తీసుకొచ్చాక.. ఆదరణ ఉంటుందా లేదా అన్న విషయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
డిమాండ్ ఉంటుందని భావిస్తున్న రూట్లలో మెట్రో స్టేషన్లు, ఫైఓవర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు ఉండటంతో.. డబుల్ డెక్కర్ బస్సులు నడపడం కష్టమని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. అవి లేని రూట్లలో నడిపిస్తే పెద్దగా డిమాండు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. గతంలో డబుల్ డెక్కర్ బస్సుల్లో ప్రయాణిస్తూ.. నగర అందాలను వీక్షించేందుకు అవకాశముండేదని.. కానీ ఇప్పుడు ఆ సౌకర్యం మెట్రో రైలుతో కలుగుతోందని దీంతో ప్రజలు ఎంత వరకు మెట్రో బస్సులను ఎక్కేందుకు చూపిస్తారన్నది అనుమానమే అంటున్నారు.
డబుల్ డెక్కర్ బస్సులు చాలా రోజుల తర్వాత కనిపించాయన్న ఆసక్తితో కొద్ది రోజులు పాటు ఎక్కుతారని.. ఆ తర్వాత సందేహమే అని అధికారులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు డబుల్ డెక్కర్ బస్సుల తయారీకి అశోక్‌లేలాండ్ కంపెనీ మాత్రమే ముందుకు రాగా.. ఒక్కో బస్సుకు రూ.72 లక్షల నుంచి రూ.75 లక్షల మధ్య ఖర్చు అవుతుందని తెలిసంది. దీంతో అత భారీ మొత్తం వెచ్చించి బస్సులను కొనుగోలు చేయడం సముచితమేనా అని మల్లగుల్లాలుపడుతున్నారు.