తెలంగాణ రాష్ట్ర రవాణ సంస్థ ‘AM 2 PM’ ఎక్స్ ప్రెస్ పార్శిల్ సర్వీస్ ను ప్రారంభించారు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్. హైదరాబాద్ ఆర్టీసీ బస్ భవన్ లో ‘ఏఎం టూ పీఎం’ పేరిట ఎక్స్ ప్రెస్ పార్శిల్ సర్వీసును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. లాజిస్టిక్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్న నేపథ్యంలో వినియోగదారులకు కార్గో సేవలు మరింత చేరువ చేయనున్నామని తెలిపారు. రాష్ట్రంలో వినూత్న రీతిలో 2020 జూన్ 19వ తేదీన ప్రవేశ పెట్టిన ఆర్టీసీ కార్గో సేవల ద్వారా చక్కటి సత్ఫలితాలు లభిస్తున్నాయన్నారు.
దీంతో తాజాగా ఈ సేవలను ప్రవేశ పెడుతున్నామన్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు పార్శిల్ బుక్ చేస్తే.. రాత్రి 9 గంటల్లోగా అది వినియోగదారులకు చేరే విధంగా ఈ సేవలు ప్రారంభించామన్నారు. ఒక కేజీ బరువుతో సింగిల్ ప్యాక్ మాత్రమే ఎక్స్ ప్రెస్ పార్శిల్ ద్వారా వెళ్తే రూ.90 రుసుము వసూలు చేస్తామన్నారు.
ఇప్పటికే 5 కేజీల బరువు పార్శిల్ కోసం కూడా భారీగా డిమాండ్ వస్తోందన్నారు. ఆ సేవలను కూడా త్వరలోనే ప్రవేశ పెడతామన్నారు. ఆ ధరలు కూడా వేరుగా ఉంటాయన్నారు. తిరుపతి, వైజాగ్, బెంగుళూరు వంటి నగరాలకు కూడా ఈ సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. ఐటీ, సాంకేతిక పరిజ్ఞానం పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్న తరుణంలో భవిష్యత్తులో మరిన్ని ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.
అంతేకాకుండా ఆర్టీసీ ప్రయాణికులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఇప్పటికే ప్యాకేజెడ్ డ్రికింగ్ వాటర్ ను కూడా ప్రారంభామన్నారు. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న బాటిళ్లకు భిన్నంగా డైమెండ్ కట్స్ తో జీవా వాటర్ బాటిల్ ను డిజైన్ చేశామన్నారు. లైటింగ్ పడగానే మంచినీళ్ల బాటిల్ మెరుస్తుందన్నారు సజ్జనార్.