పండగ వేళ రెండు రాష్ట్రాల ప్రజలకి ఇబ్బందులు తప్పేట్టు లేవు. ఎవరైనా ఆర్టీసీ బస్సుల్ని బుక్ చేసుకుంటే వెంటనే క్యాన్సిల్ చేసుకుని ప్రత్యామ్నాయాల్ని చూసుకోవడం మంచిది. ఎందుకంటే ఆర్టీసీలో సమ్మె తప్పేట్టు లేదు.
హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె తప్పేట్టు కనిపించడం లేదు. పండుగ సమయంలో ప్రజలు ఇబ్బందులు పడేడట్టే వుంది. ప్రభుత్వం నుంచి కనిపించని స్పందన, ఆర్టీసీ యూనియన్ల హెచ్చరికలు వంటి తాజా పరిణామాలు గమనిస్తే అలాగే అనిపిస్తోంది.
ఆర్టీసీ కార్మిక సంఘాలతో సీనియర్ ఐఏఎస్ ఆధ్వర్యంలోని సోమేష్‌కుమార్ కమిటీ చర్చలు విఫలమయ్యాయి. చర్చలు విఫలమయ్యాయని, 5వ తేదీ నుంచి సమ్మె యథాతధంగా ఉంటుందని కార్మిక సంఘాలు ప్రకటించాయి. ప్రభుత్వం నుంచి సరైన హామీ రాకపోవడంతో ప్రజల్ని ఇబ్బంది పెట్టక తప్పడం లేదని అంటున్నాయి. ఒకవేళ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినా వెనక్కి తగ్గేది లేదని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు.
అసలేం జరిగిందంటే.. తెలంగాణ ఆర్టీసీ యూనియన్ నేతలతో సీనియర్ ఐఏఎస్‌ల కమిటీ సమావేశమైంది. సీఎం కేసీఆర్ ఆర్టీసీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారని చెప్పుకొచ్చిన సోమేష్‌కుమార్ మేటర్ మాత్రం తేల్చలేదు. వీలైనంత త్వరగా ఆర్టీసీ నేతల డిమాండ్లపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తామపి మాత్రమే చెప్పారు. సమ్మె విషయంలో జేఏసీ నేతలు కొద్ది రోజులు ఓపిక పట్టాలని సూచించారు. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం దగ్గర ప్లాన్-ఎ, ప్లాన్-బి రెడీగా ఉన్నాయని స్పష్టం చేయడం యూనియన్ల ప్రతినిధులకు మరింత మంట పుట్టించింది. తమ న్యాయమైన డిమాండ్ల పట్ల ప్రభుత్వం అసలే ఏమనుకుంటోందని కార్మికులు మండిపడుతున్నారు.
ఆర్టీసీ యూనియన్ల జేఏసీతో జరిగిన సమావేశంలో ప్లాన్-ఏ, ప్లాన్-బి గురించి ప్రస్తావించడంపై ఆర్టీసీ కార్మిక వర్గాల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఓపక్క పొరుగు రాష్ట్రంలో ఆర్టీసీని తీసుకెళ్లి ప్రభుత్వంలో విలీనం చేశారు. అప్పటి నుంచే ఇక్కడ పనిచేసే కార్మికుల్లో ఎలాంటి పరిస్థితులలో ఇక్కడ తాము పనిచేస్తున్నామో ఒక అవగాహనకు వచ్చి నీరుగారిపోతున్నారు.
ఇప్పుడు సమ్మె విషయంలో తమ మాట వినకపోతే తమ దగ్గర ప్లాన్-బి ఉందని సోమేష్ కుమార్ చెప్పడంతో ప్రతి ఉద్యోగిలో కోపం తారస్థాయికి చేరుకుంది. అసలు ఈ విషయంలో ప్రభుత్వం ఏ రకమైన ఆలోచనతో ఉందనే దానిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈసారి కచ్చితంగా తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె చేయాలని ఆర్టీసీ ఉద్యోగులు నిర్ణయించుకున్నట్టు సమాచారం. దీంతో ప్రభుత్వం ఈ విషయంలో వేరే ప్రతిపాదనలు పెట్టినా కార్మికులు అంగీకరించే ప్రస్తావన ఉండకపోవచ్చని తెలుస్తోంది.