• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

తెలంగాణ ప్రజలారా మేల్కొండి…….

Published on : October 31, 2019 at 11:32 am

తెలంగాణా ఆర్టీసీ కార్మిక సమ్మె
రాజకీయ గుణపాఠాలూ- కర్తవ్యాలూ

ప్రియమైన మిత్రులారా, కార్మిక సమ్మెకారులారా!

తెలంగాణా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు నేటికి సరిగ్గా 25 రోజులు నిండుతున్నది. కార్మికవర్గానికి సమ్మె ఒక రాజకీయ పోరాట పాఠశాల వంటిదని లెనిన్ పేర్కొన్నాడు. అదొక పోరాట శిక్షణాలయం. సమ్మెలు కార్మికవర్గానికి అనేక పాఠాలనూ, గుణపాఠాలనూ నేర్పుతాయి. తాజా తెలంగాణా ఆర్టీసీ సమ్మె కూడా అలాంటి అనేక పాఠాలను నేర్పుతోంది.

19 ఏళ్ల క్రితం 2000లో కూడా సరిగ్గా ఇదే అక్టోబరులోనే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఉమ్మడి AP లో ఇలాగే రాజకీయ ప్రాముఖ్యత గల సమ్మెను ఆర్టీసీ కార్మికవర్గం చేపట్టింది. నాటి ఆర్టీసీ కార్మిక సమ్మెలో ఏ ఇతర డిమాండ్లు ఎన్ని ఉన్నా, సారాంశంలో తుదకు ప్రయివేటీకరణ వ్యతిరేక డిమాండ్ కేంద్రకం (ఇరుసు)గా మారింది. అప్పుడు కూడా ఇలాగే సమరశీలంగా, సమైక్యంగా సమ్మె సాగింది. అది 24 రోజులు సాగినట్లు గుర్తు! (తాజా తెలంగాణా ఆర్టీసీ సమ్మె నిన్నటికే 24 రోజులు దాటడం గమనార్హం) సమ్మె అణచివేత కై నాటి ప్రభుత్వం తీవ్ర నిర్బంధకాండ కు పూనుకున్నది. ఐనా అనేక అటుపోట్ల మధ్య తుదకు రాజకీయ విజయం పొందింది. నేటి తెలంగాణా కేసీఆర్ ప్రభుత్వం కూడా తాజా సమ్మె అణచివేత కై నిర్బంధ కాండను ప్రయోగించడంలో మరో అడుగు ముందుకేసింది. ఐనా నేడు కూడా ఇది విజయ సాధనదిశలో సాగుతోంది. ఐతే నాటికీ, నేటికీ మధ్య గమనార్హమైన ఓ తేడా ఉంది.

ప్రవేటీకరణ అంశంపై నాటి ప్రభుత్వం “అబ్బెబ్బే, ఆర్టీసీ సంస్థ ను ప్రవేటీకరించే ఉద్దేశ్యం మా ప్రభుత్వానికి లేదు” అని బయటకు చెబుతూ; లోపాయ కారీగా తన రహస్య లక్ష్య సాధనకు పూనుకున్నది. దానికి విరుద్ధంగా నేటి ప్రభుత్వం “ఔను, ప్రవేటీకరించకుండా ప్రజా రవాణా వ్యవస్థ కు భవిష్యత్తు లేదు” అని బాహాటంగానే; పైగా సగర్వంగానే ప్రకటిస్తున్నది. ఇంకా చెప్పాలంటే, ప్రవేటీకరణ అంశంపై నాటి ప్రభుత్వం “మజ్జిగకొచ్చి ముంతను దాచుకున్న చందంగా” వ్యవహరించింది. ఇప్పటి ప్రభుత్వ వ్యవహారం “మజ్జిగ పోసినా, పోయక పోయినా ముంతను మాత్రం పబ్లిక్ గా చూపించిన చందంగా” ఉంది. నిజానికి అప్పుడూ, ఇప్పుడూ ఆర్టీసీ సంస్థను కార్పొరేట్ సంస్థలకు కారుచౌకగా అమ్మడమే ప్రభుత్వాల ప్రధాన రాజకీయ విధానంగా ఉంది. వాటి లక్ష్యాల్లో తేడాలేదు. అవి అనుసరించే పద్ధతులలోనే తేడా ఉంది. నాటి పాలకులకు అది ‘రహస్య ఎజెండా’! అది వారికి నేడు ‘పారదర్శక ఎజెండా’! గత రెండు దశాబ్దాల కాలంలో అదే ముఖ్య తేడా!

నాటికీ, నేటికీ పై తేడాకి ఒక ముఖ్యమైన కారణం ఉంది. విలువైన ఆస్తులతో కూడిన టీఎస్ఆర్టీసీ సంస్థను కబ్జా చేసే లక్ష్యంగల కార్పొరేట్ సంస్థలకు “ముంత”ను దాచుకునే ఓపిక నేడు లేదు. నేడు ‘పెట్టుబడి’ లో అట్టి సహనం నశిస్తుండటమే కారణం!సమాజంలో ‘పెట్టుబడి’ నేడు గుట్టలుగా పెరుగుతోంది. అది కొద్దిమంది కుబేరుల వద్ద వ్యక్తిగత సంపద రూపంలో పొగుపడుతున్నది. నేడు అలా పొగుపడే ‘పెట్టుబడి’ ఎంత మాత్రం ఇనుప బీరువాలలో ఒదిగి ఉండజాలదు. మరింత లాభదాహంతో మరిన్ని గుడ్లుపెట్టి పొదిగి మరిన్ని పిల్లలు పెట్ట జూస్తుంది. అందుకై మారుమూల ప్రాంతాలలోకి అది విస్తరిస్తుంది. అలా తన లాభాల దారిలో ఎదురు పడే లాభదాయక ఆర్ధిక వనరులతో కూడిన సంస్థల్లో ప్రజా రవాణా సంస్థ ఒకటి! అదితన అడ్డగోలు విస్తరణకు ఒకవేళ అడ్డుగోడగా మారితే, దానిని తొలగించుకునే కర్తవ్యాన్ని ‘కార్పొరేట్ వ్యవస్థ’ చేపడుతుంది. రాజకీయ తెరపై కేసీఆర్ ప్రదర్శిస్తున్న అసహనం, అక్కసుల్లో అది వ్యక్తమౌతోంది. రాజకీయ తెర వెనుక దాగిన ‘పెట్టుబడి’ యొక్క అసహనమే దానికి అసలు కారణం. దీనివల్ల టీఎస్ఆర్టీసీ కార్మికుల తాజా సమ్మె బలాబలాల పొందికలో కూడా మార్పులు వస్తాయి. అవి సమ్మెపంథాలో కూడా చోటు చేసుకుంటాయి. ఇదే తాజా ఆర్టీసీ సమ్మె నుండి తీసుకునే వాస్తవ గుణపాఠం!

తాజా సమ్మె నాలుగు పక్షాలతో ముడి పడింది. క్రింది నాలుగు పక్షాల ప్రయోజనాలు తాజా సమ్మెలో దాగి ఉన్నాయి.
1-నాలుగు కోట్ల మంది తెలంగాణా రాష్ట్ర ప్రజలు!
2-యాబై వేలమంది రవాణా కార్మికులు! 3-తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం! 4-రవాణా సంస్థను కబళించ జూసే కార్పొరేట్ శక్తులు! ఈ నాలుగు పక్షాలలో ఎవరి స్థానం ఏమిటో తెలుసుకుందాం. వాటి స్థానాల పట్ల స్పష్టత ఉంటేనే, నేటి నిర్దిష్ట భౌతిక పరిస్థితుల్లో సమ్మె విజయవంతంకై నిర్దిష్ట అవగాహనతో, తగు నిర్దిష్ట ఉద్యమ ప్రక్రియలను చేపట్టడం సాధ్యమౌతుంది.

ఈ ప్రజా రవాణా సంస్థ రాష్ట్ర ప్రజల సేవల కోసం ప్రభుత్వ మూలధనంతో ఏర్పడింది. అది సారాంశంలో ప్రజాధనమే! ఇది స్థూలంగా రాష్ట్ర ప్రజల సమిష్టి సంపద! తిరిగి ప్రజలు చెల్లించే ఛార్జీలతోనే దాని నిర్వాహణ జరుగుతుంది. దానికి చెందిన ప్రతి బస్సు, డిపో, వర్క్ షాప్, స్టాండు, స్టేషన్, కాంప్లెక్స్, భవనం కూడా రాష్ట్ర ప్రజల సమిష్టి సంపదే! సారంలో అది ప్రజా ధనంతో ఏర్పడి, ప్రజావసరాల కోసం ప్రజలు చెల్లించే నిర్వహణా వ్యయంతో నడుస్తున్న సంస్థ! అందుకే దాని ఓనర్లు రాష్ట్ర ప్రజలే! అంటే దీనిపై నిజమైన ప్రొప్రయిటరీ హక్కులు ప్రజలవే! ఈ నాలుగు పక్షాలలో ఇదే ప్రాథమిక పక్షం!

రాష్ట్ర ప్రజలు తమ స్వంత మూలధనంతో తమకు ఉపకరించే ప్రయాణ సేవల కోసం స్థాపించుకొని, దాని నిర్వహణా చెల్లింపుల వ్యయాన్ని తామే స్వంతంగా భరిస్తూ నడిపించుకుంటున్నదే ప్రజా రవాణా సంస్థ! ఐతే అది తనంతట తాను రాష్ట్ర ప్రజలకు సేవలను అందించలేదు. రాష్ట్ర ప్రజల మూలధనం గానీ; దానితో కొనుగోలు చేసిన బస్సులు గానీ వాటంతట అవే, వాటి ఓనర్లు ఐన రాష్ట్ర ప్రజలకి ప్రయాణ సేవలను అందించ లేవు. ఆ బస్సులు వాటి ఓనర్లు ఐన రాష్ట్ర ప్రజలకు ప్రయాణ సేవలు అందించాలంటే, వాటిని నడిపించే నిపుణ శ్రామికవర్గం ఉండాలి. అట్టి నైపుణ్యం సాధించిన డ్రైవర్లు, క0డక్టర్లు, మెకానిక్కులు వగైరా కార్మిక వర్గంతో పాటు కొద్దిశాతం మంది ఉద్యోగవర్గం కూడా అవసరం! వీరిని రాష్ట్ర ప్రజలు తమ బిడ్డల నుండి ఎంపిక చేసుకుంటారు. అవే రవాణా కార్మిక, ఉద్యోగ వర్గాలు! వీరిలో ప్రధాన శక్తి కార్మికవర్గమే! రాష్ట్ర ప్రజలు తమ రవాణా సంస్థ ద్వారా ఏ ఏ ప్రయాణ సేవలను పొందాలో, వాటిని వారికి అందించడానికే ఈ నిపుణ కార్మికవర్గం పరిమితం కాదు. రాష్ట్రప్రజల రవాణాసంస్థకి చెందిన విలువైన ఆస్తులకు నిత్య నిర్వాహణ మరియు పరిరక్షణ బాధ్యతలను కూడా చేపడుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, రాష్ట్ర ప్రజల విలువైన సంపన్న ఆస్తులకు సెక్యూరిటీ గార్డుగా నిలుస్తుంది. A-ఒకవైపు నిరంతర ప్రయాణ సేవలను ప్రజలకు అందిస్తుంది. B-మరోవైపు సంస్థ ఆస్తులకు నిత్య కాపలా బాధ్యతలను నిర్వహిస్తుంది. ప్రతిఫలంగా తమ బిడ్డలైన కార్మికవర్గాన్ని పోషించుకునే బాధ్యతను రాష్ట్ర ప్రజలు తీసుకుంటున్నారు. అంటే రాష్ట్ర ప్రజల చెల్లింపుల ద్వారా రవాణా సంస్థకు లభించే రాబడి నుండి కొద్ది భాగాన్ని తమ ప్రియతమ బిడ్డలైన కార్మికవర్గ జీతభత్యాల నిమిత్తం రాష్ట్ర ప్రజలు చెల్లింపు చేస్తున్నట్లుగా భావించాల్సి ఉంది. పైన పేర్కొన్న నాలుగు పక్షాల్లో కార్మిక, ఉద్యోగవర్గాలు (ముఖ్యంగా కార్మిక వర్గం) కీలక పాత్ర పోషించే ద్వితీయ పక్షం!

నాలుగు కోట్లమంది రాష్ట్ర ప్రజలకి ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సంస్థకు ఒక ట్రస్టీ మాత్రమే! నాలుగు కోట్ల మంది ట్రస్ట్ సభ్యులే! మూలధనంలో భాగస్టులుగా రాష్ట్ర ప్రజలందరూ షేర్ హోల్డర్లే! ట్రస్టు ఆస్తులకు ప్రభుత్వం విధిగా జవాబు దారీగా ఉండాలి. దానికి బోడి పెత్తనం చేసే అధికారం లేదు. గల్లీ నుండి ఢిల్లీ వరకు నేడు పాలకులు చేసేది అట్టి బోడి పెత్తనమే! నిజానికి తొలి దశలో ఇలాంటి ప్రజా రవాణా సంస్థల పట్ల ఆయా ప్రభుత్వాలు సహకార పాత్రను పోషించేవి. ఆయిల్, యంత్రాలు, బస్సుల కొనుగోళ్ళల్లో పన్ను రాయితీల తో పాటు మరెన్నో రూపాల్లో సాయం అందిస్తుండేవి. నాడు ప్రభుత్వాలు ఈ సంస్థల పట్ల ప్లస్ పాత్ర పోషించేవి. తర్వాత మలి దశలో వీటికి తాము అందించే సాయాన్ని అవి నిలిపి వేసాయి. ఐతే సంస్థ ద్వారా వివిధ వర్గాల ప్రజలకి రాజకీయంగా, సంక్షేమపరంగా తాము ఇప్పించిన రాయుతీల సొమ్ముని సకాలంలో సంస్థకు ప్రభుత్వాలు చెల్లిస్తుండేవి. నాడు తటస్థ పాత్ర (న్యూట్రల్) ను పోషించాయి. నేడు ఒకవైపు అదనపు పన్నులు, మరోవైపు రాయుతీ బాకీలు చెల్లించ కుండా లేదా వాటి ఎగవేతలతో ప్రజా రవాణా సంస్థల్ని దివాళా తీయిస్తున్నాయి. పైగా ప్రజా రవాణా సంస్థల విలువైన ఆస్తుల్ని బడాకార్పొరేట్ సంస్థల కి కారుచౌకగా అప్పగించే పరమ పొలిటికల్ బ్రోకర్ వ్యవస్థలుగా “ప్రజా ప్రభుత్వాలు” దిగజారాయి. అట్టి రాజకీయ దిగజారుడు మార్గంలో కేసీఆర్ ప్రభుత్వం చాలా ముందున్నది. ఈ విధంగా ప్రజల రవాణా రంగ సంస్థ తరపున సాంకేతికంగా తప్ప ఇతర ఏ రీత్యా కూడా ప్రాతినిధ్యం వహించే కనీస అర్హత లేని నైతికభ్రష్ట ప్రభుత్వం ఈ సమ్మె సంబంధిత పక్షాలలో మూడో పక్షంగా ఉంది.

ఇలాంటి ప్రజా రవాణా సంస్థలు ప్రజాధనంతో స్థాపించబడ్డ కాలాలలో “ప్రయివేటు పెట్టుబడి” కి ఈ తరహా సేవా రంగాలలో ప్రవేశించే ఆసక్తి లేదు. అప్పటికి వాటి నుండి తగినన్ని లాభాలు వచ్చే అవకాశాలు లేకపోవడంతో పాటు, వాటిలో పెట్టుబడులు పెట్టే సామర్ధ్యం కూడా నాటి ప్రయివేటు పెట్టుబడిదార్ల కు లేకపోవడమే కారణం! నేడు పరిస్థితి మారింది. శ్రమశక్తి ని కొల్లగొట్టి గడించిన పెట్టుబడి పోగుపడుతోంది. అది ఏ ఒక్క సేవారంగాన్ని వదలడానికి కూడా నేడు సిద్ధంగా లేదు. ఒకనాడు పెట్టుబడి ఇలాంటి సేవారంగాలు తనకు అక్కర లేదని వాటికి దూరంగా ఉంది. ఆనాడు ఇలాంటి సేవా సంస్థలు 1-ప్రజలు 2-కార్మికులు 3-ప్రభుత్వం అను మూడు పక్షాలతో ముడిపడి ఉండేవి. ఐతే ‘ప్రజలు’ ఆచరణలో ‘నిశ్శబ్ద ప్రేక్షకులు’ గా ఉండే వాళ్ళు! వాటిలో జరిగే సమ్మెలు, ఒప్పందాలు ప్రధానంగా 1-కార్మికవర్గం 2-ప్రభుత్వం అనే రెండు పక్షాల తోనే ముడిపడేవి. సరళీకరణ విధానాల తర్వాత ప్రయివేటు పెట్టుబడికి బలం చేకూరింది. దాదాపు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో అది నేడు నాలుగో పక్షంగా మారి, ఆచరణలో చోదకశక్తిగా తయారైనది. 2000లలో ఆర్టీసీ సమ్మె నాటికి దాన్ని కబ్జా చేసే లక్ష్యంగల ప్రయివేటు పెట్టుబడి ఇంకా తెరవెనుక శక్తిగానే ఉండేది. దాని తరపున నిలిచే ప్రభుత్వం “అబ్బెబ్బే మాకు ప్రవేటీకరణ చేసే ఉద్దేశ్యం లేదు” అని ప్రజల కు సంజాయిషీ ఇచ్చే స్తితి ఉండేది. ఇప్పుడు అలా ఓపిక పట్టే స్తితి దానికి లేదు. ఇటీవల కాలంలో అది దూకుడు శక్తిని ప్రదర్శిస్తోంది.దాని పతిబింబమే కేసీఆర్ లో నేడు వ్యక్తమయ్యే తీవ్ర అసహనం! అందుకే ఆర్టీసీ లో జరిగే తాజా సమ్మె లో దానిని కబ్జా చేసే లక్ష్య0గల బడా కార్పొరేట్ వర్గం కొత్తగా నాలుగో పక్షంగా చేరింది.

ఇలా కొత్తగా చేరిన నాలుగో పక్షమైన పెట్టుబడి కి ఆంధ్ర, తెలంగాణ సరిహద్దులు లేవు. తెలుగు-తెలుగేతర వివక్షతలు లేవు. ఉత్తరాది, దక్షిణాది ఎల్లలు లేవు. దేశ-విదేశీ విభజనలు ఉండవు. అట్టి ఎల్లలు లేని శక్తివంతమైన పెట్టుబడుల చేతుల్లో నేడు కేసీఆర్ ప్రభుత్వం ఒక పనిముట్టుగా మారడం కాకతాళీయ సంఘటన కాదు. ఏడేళ్ల క్రితం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేంత వరకూ ప్రాంతీయ అస్తిత్వవాదిగా కేసీఆర్ పేరొందాడు. అది నిన్నటి మాట! కానీ రేపటి కేసీఆర్ ప్రభుత్వం అలా ఉండదు. అది అన్నిరకాల ప్రాంతీయ సరిహద్దులనూ, వివిధ ఆస్తిత్వాలనూ నిర్దాక్షిణ్య0గా చేరిపేసే రాజకీయ సామర్ధ్యం గల పెట్టుబడులకు ప్రాతినిధ్య శక్తిగా అవతరిస్తుంది. అది ఆర్ధిక సూత్రాల నియమమే! తాజా ఆర్టీసీ సమ్మె సందర్భంగా కేసీఆర్ ప్రదర్శిస్తున్న రాజకీయ వైఖరి అందుకు నిదర్శనం! విలువైన రవాణా సంస్థ ఆస్తుల్ని కేసీఆర్ సర్కార్ అప్పగించదలిచిన కార్పొరేట్ శక్తులు ఎంతటి బలమైనవో; తాజా ఆర్టీసీ కార్మికవర్గంపై అంతటి బలమైన దాడి ఉండటం సహజం! ఇప్పటికే సాంప్రదాయ పంథాకు భిన్నమైన సమరశీల, సమైక్య రాజకీయ తాజా సమ్మె రూపాంతరం చెందింది. వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక సంస్థలు, ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు, హక్కుల సంఘాలు ఆదర్శ పాత్రను పోషిస్తున్నాయి. అది స్వాగతించదగ్గ సానుకూల పరిణామం! దానికి తోడు క్రింది మరో గుణపాఠం కూడా తీసుకోవాల్సి ఉంది.

నాలుగో పక్షమైన ప్రయివేటు పెట్టుబడి రంగ ప్రవేశం చేయని గత కాలాలలో కారణాలు ఏమైనప్పటికీ ఆర్టీసీ సంస్థకు వాస్తవ ఓనర్లు ఐన రాష్ట్ర ప్రజలు దాదాపు ప్రేక్షక పాత్రను పోషిస్తుండే వారు. ఆచరణలో నాడు వైరుధ్యం రెండో కీలక పక్షమైన కార్మికవర్గానికీ; ట్రస్టీ పాత్ర పోషించే మూడో పక్షమైన ప్రభుత్వానికీ మధ్య ఉండేది. సమ్మెలు ప్రధానంగా పై రెండు పక్షాలమధ్య ఒప్పందాలతో ముగిసేవి. నాటి భౌతిక పరిస్థితి మారింది. ఐనా తాజా సమ్మె సందర్భంగా కూడా తెరమీద రెండవ మరియు మూడవ పక్షాల మధ్యే (కార్మికవర్గం & ప్రభుత్వం మధ్యే) ప్రధాన సంఘర్షణ వ్యక్తమౌతోంది. కానీ తెర వెనుక వాస్తవ వైరుధ్యం అలా లేదు. అది మొదటి మరియు నాల్గవ పక్షాల మధ్య (రాష్ట్ర ప్రజలు & కార్పొరేట్ వర్గం) ప్రధాన వైరుధ్యంగా కేంద్రీకృతమైనది. తెరవెనుక దాగిన ఈ వాస్తవ వైరుధ్యాన్ని ఎంత ఎక్కువ స్థాయిలో తెర మీదికి తేగలిగితే, అంత ఎక్కువ స్థాయిలో పరిస్కార అవకాశాలు పెరుగుతాయి.

ఈ సమ్మె విజయం సాధిస్తే ఒకవైపు నాలుగు కోట్ల మంది రాష్ట్ర ప్రజల విలువైన ఆస్తులు సాంకేతికంగా ప్రజల చేతుల్లోనే ఉంటాయి. రాష్ట్ర ప్రజల బిడ్డలైన ఆర్టీసీ కార్మిక, ఉద్యోగ వర్గాలకు ఉద్యోగ భద్రత ఆచరణలో నిలుస్తుంది. ఈ రెండూ సాపేక్షిక విజయాలే ఐనప్పటికీ, అవి ప్రజలలో, ముఖ్యంగా కార్మిక, శ్రామిక, ఉద్యోగ వర్గాలలో గొప్ప విజయోత్సవ స్ఫూర్తిని నింపుతాయి. మరెన్నో నూతన విజయాలకు బలాన్ని ఇస్తాయి. ఈ సమ్మె ఒకవేళ విఫలమైతే నష్ట పోయేది నిజానికి రవాణా రంగ కార్మిక, ఉద్యోగ వర్గాల కంటే రాష్ట్ర ప్రజల భాగమే ఎక్కువ! ప్రస్తుత ప్రజా రవాణా సంస్థ ద్వారా రాష్ట్ర ప్రజలు పొందే అనేక రాయుతీలు, ఇతర ప్రయాణ సేవలు, సౌకర్యాలు సెకండరీ స్థాయు ప్రయోజనాలు మాత్రమే! కానీ దాని సమస్త ఆస్తులపై రాష్ట్ర ప్రజలకు గల ప్రోప్రయటరీ హక్కులు ప్రాథమిక అండ్ ప్రధానమైన ప్రయోజనాలు కావడం గమనార్హం! కార్మిక, ఉద్యోగ వర్గాలు కోల్పోయేది అందుకు భిన్నం! ప్రభుత్వ రంగ వ్యవస్థ ద్వారా వారు అదనంగా పొందే ఉద్యోగ భద్రత, కొన్ని ప్రత్యేక హక్కుల్ని మాత్రమే కోల్పోతారు. కానీ మౌలికమైన ఉద్యోగ, ఉపాధి సౌకర్యాలను కోల్పోరు. తమ చేతిలో వృత్తి నైపుణ్యం ఉన్నంత వరకు ప్రయివేటు రవాణా రంగంలో సైతం కొన్ని పరిమితులకూ పరిధులకూ లోబడి తమ ఉపాధిని నిలబెట్టు కోగలరు. ప్రాథమిక ఉపాధి ఉంటుంది. కానీ సెకండరీ హక్కుల్ని కోల్పోతారు. వాస్తవార్ధంలో కార్మికవర్గం సెకండరీ ప్రయోజనాలను కోల్పోతే, రాష్ట్ర ప్రజలు రెండురకాల (ప్రాథమిక&ద్వితీయ) ప్రయోజనాలనూ కోల్పోతారు. రాష్ట్ర ప్రజలు కోల్పోయే ప్రయాణ సౌకర్యాల తక్కువేమీ కాదు. కానీ పదుల వేల కోట్ల రూపాయల విలువైన సంస్థ ఆస్తులపై కోల్పోయే హక్కు అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ! ఇదే అంశ0పై రాష్ట్ర ప్రజలను చైతన్య పరిచే కీలక రాజకీయ బాధ్యత కార్మిక వర్గంపై ఉంది. అదేవిధంగా సమ్మెకి మద్దతు ఇస్తున్న వివిధ పార్టీలు, సంస్థలు, శక్తులపై కూడా ఉంది. ఈ నూతన ప్రయోగాత్మక ఒరవడిలో ప్రచారసరళిని చేపట్టి రాష్ట్ర ప్రజలని మేల్కొలపడం నేటి భౌతిక స్థితిగతుల్లో కార్మికవర్గ తక్షణ అత్యవసర కర్తవ్యం. కార్పొరేట్ శక్తుల అండతో తాజా సమ్మెపై కేసీఆర్ ప్రభుత్వ నిరంకుశ దాడిని తిప్పికొట్టి, నిర్ణయాత్మక రాజకీయ విజయాన్ని సాధించేందుకు కార్మికవర్గం తీసుకునే గుణాపాటమిది!

tolivelugu app download

Filed Under: అవీ ఇవీ...

Primary Sidebar

ఫిల్మ్ నగర్

ఇండియా విజయంపై మహేష్ వెంకీలు ఏం ట్వీట్ చేశారో తెలుసా ?

ఇండియా విజయంపై మహేష్ వెంకీలు ఏం ట్వీట్ చేశారో తెలుసా ?

బాలయ్య కు థాంక్స్ చెప్పిన అల్లరి నరేష్

బాలయ్య కు థాంక్స్ చెప్పిన అల్లరి నరేష్

మాస్టర్ ఆ మార్క్ కూడా క్రాస్ చేసిందా ?

మాస్టర్ ఆ మార్క్ కూడా క్రాస్ చేసిందా ?

తలైవి రిలీజ్ ఎప్పుడో తెలుసా ?

తలైవి రిలీజ్ ఎప్పుడో తెలుసా ?

ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ షూట్ స్టార్ట్

ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ షూట్ స్టార్ట్

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

ఏపీలో క‌రోనా కొత్త కేసులెన్నంటే...

ఏపీలో క‌రోనా కొత్త కేసులెన్నంటే…

చైనా దురాక్ర‌మ‌ణ‌పై జేపీ న‌డ్డా వ‌ర్సెస్ రాహుల్ గాంధీ

చైనా దురాక్ర‌మ‌ణ‌పై జేపీ న‌డ్డా వ‌ర్సెస్ రాహుల్ గాంధీ

ఇప్ప‌టికీ పేద దేశాల‌కు అందిన వ్యాక్సిన్లు 25 మాత్ర‌మే!

ఇప్ప‌టికీ పేద దేశాల‌కు అందిన వ్యాక్సిన్లు 25 మాత్ర‌మే!

భార‌త్ బ‌యోటెక్ కోవాక్జిన్ కు మ‌రో 45ల‌క్ష‌ల డోసుల ఆర్డ‌ర్

భార‌త్ బ‌యోటెక్ కోవాక్జిన్ కు మ‌రో 45ల‌క్ష‌ల డోసుల ఆర్డ‌ర్

high tension at huzur nagar

ధాన్యం కొనుగోలు చెయ్యనప్పుడు ప్రభుత్వం ఎందుకు ?

Revanth reddy In GHMC Elections campaign

గల్లీ లో కుస్తీలు… ఢిల్లీ లో దోస్తిలా ?

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)