పల్లె వెలుగు బస్సుల్లో చిల్లర సమస్యకు టీఎస్ఆర్టీసీ చెక్ పెట్టనుంది. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. బస్ టికెట్ల ధరల్లో స్పల్ప మార్పులు చేసినట్టు ప్రకటించింది. చిల్లరతో ఎదురవుతున్న సమస్యలను సరిచేసేందుకు టికెట్ల చార్జీలు రౌండప్ చేసినట్టు ఆర్టీసీ ఉన్నతాధికారులు వెల్లడించారు.
రూ.12 ఛార్జీ ఉన్న చోట టికెట్ ధర రూ.10గా రౌండప్ చేసినట్టు.. రూ.13, రూ.14 ఉన్న టికెట్ ఛార్జీని రూ.15గా ఫైనల్ చేస్తునట్టు తెలిపారు. 80 కిలోమీటర్ల దూరానికి రూ.67 ఉన్న ఛార్జీని.. రూ.65గా నిర్ధారించినట్టు పేర్కొన్నారు.
టోల్‌ప్లాజాల వద్ద ఆర్డినరీ బస్సులో అయితే రూ.1, హైటెక్, ఏసీ బస్సులకు రూ.2 అదనంగా ప్రయాణీకుల నుంచి వసూలు చేయనున్నారు. సవరించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
ప్రయాణీకులు ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని కోరారు. అయితే.. ఎక్కువగా పల్లె వెలుగు బస్సుల్లో సామాన్య పేద ప్రజలే ప్రయాణిస్తారు. చార్టీల మార్పులతో భారం అంతా సామాన్యులపైనే పడనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అది పేదలకు బండ రాయిగా మారుతోందని అంటున్నారు.