కరోనా పెరుగుతున్న తరుణంలో పట్టణాల్లో జీవించే ప్రజలంతా పల్లెల బాట పట్టారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో నివసించే వారిలో చాలా మంది సంక్రాంతి పండగకు తమ తమ సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. అయితే.. నేటితో సంక్రాంతి పండగ పూర్తికావడంతో సొంత ఊళ్లకు వెళ్లిన ప్రయాణికులు తిరిగి హైదరాబాద్ కు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
దీంతో ఇవాళ్టి నుంచి మళ్లీ హైదరాబాద్ కు తిరిగి వచ్చే ప్రయాణికుల కోసం టీఎస్ఆర్టీసీ, రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే శాఖ 110 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. సొంత ఊళ్లకు వెళ్లిన వారి కోసం 3,500 ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
అంతేకాకుండా హైదరాబాద్ లో నివసిస్తున్న ఆయా జిల్లాలకు చెందిన వారు సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేందుకు ఇంతకుముందు కూడా ఆర్టీసీ పత్యేక బస్సులను కేటాయించింది. పండగ సందర్భంగా టీఎస్ఆర్టీసీ 4940 ప్రత్యేక బస్సులు నడిపింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులు నడిపినట్టు సజ్జనార్ తెలిపారు.