అమరావతిలో తిరుమల తరహా ఆలయ నిర్మాణానికి చంద్రబాబు సర్కార్ రూ.150 కోట్లు కేటాయిస్తే… ఇప్పుడు టీటీడీ పాలకమండలి దాన్ని 36 కోట్లకు కట్ చేసింది. తిరుపతి స్మార్ట్ సిటీగా ప్రకటించాక కూడా టీటీడీ నిధులు ఎందుకివ్వాలనే చర్చ పాలకమండలిలో జరిగింది.

అవిలాల ట్యాంక్ అబివృద్ధికి కేటాయించిన నిధులను బాలాజీ రిజర్వాయర్ నిర్మాణానికి మళ్లించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. టీటీడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు సబ్ కమిటీని నియమించాలని కూడా పాలకమండలి నిర్ణయించింది. చైర్మైన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఇవాళ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రమణ దీక్షితులు వ్యవహరం కోర్టు పరిధిలో వున్నందున ఆ అంశంపై పాలకమండలిలో చర్చించలేదని సమావేశం తరువాత మీటింగ్ విశేషాలను మీడియాకు వివరిస్తూ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలో శాశ్వత ప్రాతిపదికన నీటి సమస్యను పరిష్కరించేందుకు బాలాజీ రిజర్వాయర్ నిర్మిస్తామన్నారు. ఏపీ ప్రస్తుత రాజధాని అమరావతిలో తలపెట్టిన శ్రీవారి ఆలయానికి గత ప్రభుత్వం కేటాయించిన రూ.150 కోట్లను ప్రస్తుత అవసరాల మేరకు రూ. 36 కోట్లకు కుదింపు చేసినట్లు చైర్మైన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిని స్మార్ట్ సిటిగా ప్రకటించిన తరువాత టీటీడీ నిధులు కేటాయింపు చెయ్యడం సమంజసం కాదన్నారు. గరుడ వారధికి ప్రభుత్వంతో సంప్రదించిన తరువాత నిధులు కేటాయిస్తామని వైవి సుబ్బారెడ్డి చెప్పారు.