తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సభ్యులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొండపై ప్రైవేట్ హోటళ్లను తొలగించాలని నిర్ణయించింది పాలకమండలి. దర్శనానికి వచ్చేది పీఎం, సీఎం, వీఐపీ అయినా.. సాధారణ భక్తుడైనా అందరూ టీటీడీ అన్నప్రసాదం తినాల్సిందేనని స్పష్టం చేసింది.
సిఫార్సు లేఖలపై జారీ చేసే ఆర్జిత సేవా టికెట్ల ధరల పెంపునకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఆర్జిత సేవా టికెట్ల ధరల పెంపుపై సభ్యుల నుంచి వ్యతిరేకత వచ్చింది. ధరల పెంపును కొంతమంది వ్యతిరేకించడంతో ఎస్వీబీసీ లైవ్ లింక్ ను టీటీడీ కాసేపు కట్ చేసింది.
వస్త్రాలంకరణ సేవా టిక్కెట్ ను లక్ష రూపాయలకు పెంచింది. ఆనంద నిలయానికి బంగారు తాపడం వేయాలని నిర్ణయించింది. అలిపిరి దగ్గర నాలుగు ఎకరాల్లో ఆధ్యాత్మిక సిటీని నిర్మించాలని.. అన్నమయ్య నడక మార్గాన్ని అభివృద్ధి చేయనున్నట్లు పాలకమండలి తెలిపింది. సుప్రభాతం రూ.2వేలు, తోమాల, అర్చన రూ.5వేలు, కళ్యాణోత్సవం రూ.2,500, వేద ఆశీర్వచనం రూ.10వేల పెంపునకు ఆమోదం తెలిపింది పాలకమండలి.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. త్వరలో సాధారణ భక్తులకు పూర్తిస్థాయిలో సర్వదర్శనాలను తీసుకొస్తామని తెలిపారు. కేంద్రం నుంచి అనుమతులు వచ్చాక మూడో ఘాట్ రోడ్డు నిర్మాణం పనులు చేపడతామన్నారు. తిరుపతి బాలాజీ జిల్లా కలెక్టరేట్ కోసం టీటీడీ పద్మావతి నిలయాన్ని ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న శ్రీనివాస సేతు వంతెన నిర్మాణ పనుల కోసం ఈ ఏడాది డిసెంబర్ లోగా రూ.150 కోట్ల నిధులు విడుదల చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం 2022-23 బడ్జెట్ ను రూ.3,096.40 కోట్లతో ఆమోదించినట్లు చెప్పారు సుబ్బారెడ్డి.