తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఓ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. ఒంటిమిట్ట కోదండరామ స్వామి ముత్యాల తలంబ్రాల కార్యక్రమం జరుగుతున్న సమయంలో.. తంబ్రాలను అపహరణకు పాల్పడ్డాడు టీటీడీ ఉద్యోగి. ముత్యాల మూట నుంచి కొన్ని తలంబ్రాలను అపహరించాడు.
ఈ ఘటనను టీటీడీ సూపరింటెండెంట్ రమేష్ గుర్తించారు. వెంటనే సంబంధిత ఉద్యోగిపై చర్యలు తీసుకున్నారు. కాగా ముత్యాల తలంబ్రాల ప్యాకింగ్ సమయంలోనూ పలువురు టీటీడీ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే ఇటీవల శ్రీవారి దర్శన బ్లాక్ టికెట్ల దందా గుట్టురట్టయింది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బ్లాక్‌లో అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. 12 టికెట్లను రూ.38 వేలకు భక్తులకు దళారీ కరుణాకర్ విక్రయిస్తుండగా పట్టుకున్నారు. కాణిపాకం ఆలయంలో కాంట్రాక్ట్ గ్యాస్ ఆపరేటర్‌గా కరుణాకర్ పనిచేస్తున్నాడు.
గతంలోనూ దర్శన టికెట్లు అమ్ముతూ నిందితుడు పట్టుబడ్డాడు. ఏఈవో మాధవ్‌రెడ్డితో కలిసి సుపథం టికెట్లు అమ్మినట్లు సమాచారం. ఎఫ్‌ఐఆర్ కాపీ ఆధారంగా ఏఈవోకు ఈవో మెమో జారీ చేయనున్నారు. ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన కొందరు ఉద్యోగులు ఎక్కువగా చేతి వాటం ప్రదర్శించి.. వార్తల్లో నిలుస్తున్నారు.