కరోనా వైరస్ కారణంగా రెండేళ్లుగా ప్రపంచమంతా అతలాకుతలం అవుతోంది. దీంతో అన్ని రంగాలపై ప్రభావం పడింది. ఈ క్రమంలోనే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి హుండీ ఆదాయంపై కూడా ప్రభావం చూపింది. కరోనా ఆంక్షల కారణంగా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. దీంతో హుండీ ఆదాయం కూడా పడిపోయింది.
ఇటీవల కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో.. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. దాంతో శుక్రవారం హుండీ ఆదాయం గణనీయంగా పెరిగి కొత్త రికార్డు సృష్టించింది.
తిరుపతి స్వామి వారిని శుక్రవారం 56,559 మంది భక్తులు దర్శించుకోగా.. 28,751 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో శ్రీవారికి భారీ స్థాయిలో కానుకలు ఇచ్చుకున్నారు భక్తులు. ఒక్కరోజే రూ.5.41 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్టు టీటీడీ అధికారులు ప్రకటించారు.
2012 ఏప్రిల్ 1న అత్యధికంగా రూ. 5.73 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పటి వరకు కూడా అదే అత్యధిక రికార్డుగా ఉంది. అయితే.. శుక్రవారం వచ్చిన ఆదాయం ఆ రికార్డుకు దరిదాపుగా వచ్చింది. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడే అత్యధిక హుండీ ఆదాయం నమోదైనట్టు తెలిపారు అధికారులు.