సాధారణంగా టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలకి ఏపీ ముఖ్యమంత్రి స్వామివారికి పట్టువస్త్రాలు తీసుకెళ్లడం ఆనవాయితి. ఈసారి ఏపీ ముఖ్యమంత్రితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా పట్టువస్త్రాలు తీసుకురానున్నారా? ఇవాళ ఏపీ ముఖ్యమంత్రితో వెళ్లి టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రికి బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వానపత్రికను అందించడం వల్ల ఈ కొత్త సందేహాలు వస్తున్నాయి.
గతంలో పొరుగు రాష్ట్రాలకు వెళ్లి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికను అందించిన దాఖలాలు లేవు. దేశవ్యాప్తంగా వున్న ప్రముఖులకు ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వాన పత్రికల్ని పోస్టు రూపంలో పంపించడం జరుగుతుంది. ఈసారి ఏపీ ముఖ్యమంత్రి జగన్ వెళ్లి స్వయంగా టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సతీసమేతంగా బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వానం అందించడం రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాల దృష్ట్యా శ్రేయస్కరమే అయినా కేసీఆర్ ఈ ఆహ్వానాన్ని మన్నించి ఒకవేళ వస్తే ముఖ్యమంత్రి హోదాలో పట్టు వస్త్రాలు కానీ తీసుకుని వస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈనెల 28 వ తేదీ నుంచి తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు సకుటుంబంగా రావాలని టీటీడీ పాలకమండలి ఛైర్మన్ సుబ్బారెడ్డిని వెంటబెట్టుకుని వెళ్లి జగన్ ఆహ్వానాన్ని అందించారు. జగన్ వెంట ప్రగతి భవన్‌కు వెళ్ళిన వారిలో టీటీడీ పాలకమండలి చైర్మన్, ఇతర సభ్యులు వున్నారు.