వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నేటి అర్ధరాత్రి నుంచే వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి. కొత్త సంవత్సరం ప్రారంభం..ముక్కోటి ఏకాదశి కావటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. పది రోజుల పాటుగా శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది.
1.45 గంటల నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు మొదలుపెట్టనున్నారు. నేడు ఏకాదశి సందర్భంగా తిరుప్పావైతో శ్రీవారిని మేల్కొలిపి ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత దక్షిణ, ఉత్తర భాగంలోని వైకుంఠ ద్వారాలను తెరుస్తారు. ఇందు కోసం తిరుపతిలో ప్రత్యేకంగా తొమ్మది కౌంటర్లను సిద్దం చేసింది.
వైకుంఠ ద్వార దర్శనం కొనసాగే పది రోజుల పాటు సిఫార్సు లేఖలను రద్దు చేసింది. ఇప్పటికే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవారి టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసిన టీటీడీ అధికారులు టైంస్లాట్ సర్వదర్శన టోకెన్లను నేడుమధ్యాహ్నం 2 గంటల నుంచి తిరుపతిలో తొమ్మిది ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా భక్తులకు జారీ చేయనున్నారు.
జనవరి 2 (రేపటి) నుంచి 11వ తేదీ వరకు ప్రతీ రోజు దాదాపు 80 వేల మంది భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేసారు. ఇందు కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లకు బారికేడ్లు సిద్దం అయ్యాయి. రేపు ఉదయం శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి స్వర్ణరధంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగి భక్తులను దర్శనమివ్వనున్నారు.