తిరుపతి: తిరుమల అన్నమయ్య భవన్‌లో ఈనెల 23న తిరుమల తిరుపతి దేవస్థానం 50వ ధర్మకర్తల మండలి కొలువుదీరనుంది. 23వ తేదీన టీటీడీ పాలకమండలి నూతన సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. సోమవారం ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. టీటీడీ పాలకమండలి సభ్యులుగా మెుదట 28 మందిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మరో ఏడుగురికి ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం కల్పిస్తూ మరో జీవో ఇచ్చింది. దీంతో పాలకమండలిలో సభ్యుల సంఖ్య మెుత్తం 35కు చేరింది. ఇంత భారీ పరిమాణంలో పాలకమండలిని ఏర్పాటుచేయడంపై ప్రభుత్వాన్ని తప్పుబడుతూ ప్రతిపక్షాలు, భక్తులు, ఆధ్యాత్మిక రంగ ప్రముఖులు విమర్శలు చేస్తున్నా ప్రభుత్వం వాటిని ఖాతరు చేయడం లేదు. తాజాగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర విభాగం ఒక ప్రకటన చేస్తూ పాలకమండలి ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే న్యాయపోరాటం తప్పదని హెచ్చరించింది. పాలకమండలిలో మరో ఏడుగురికి ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీఅయ్యాయి. ప్రత్యేక ఆహ్వానితులుగా శాసనసభ్యుడు భూమన కరుణాకర్‌రెడ్డి, రాకేశ్ సిన్హా (దిల్లీ), శేఖర్ (చెన్నయ్), కుపేందర్‌రెడ్డి (బెంగళూరు),గోవిందహరి (హైదరాబాద్),దుష్మంత్‌కుమార్ దాస్ (భువనేశ్వర్), అమోల్ కాలే (ముంబయి)లను నియమించారు.