వడ్డీ కాసుల వాడని పేరున్న తిరుమల శ్రీవారికే శఠగోపం పెడుతున్నారు. శ్రీవారి సేవలో తరించాల్సిన వారు శ్రీవారిని మరిచి ప్రభుత్వ పెద్దల నామస్మరణ చేయటంలో మునిగిపోయారు. ప్రభుత్వ పెద్దలు, వారికి కావాల్సిన వారి దృష్టిలో పడేందుకు అత్యుత్సాహాం ప్రదర్శిస్తున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన శరదా పీఠీధిపతి స్వరూపానందేంద్రకు టీటీడీ అధికారులు అలిపిరి వద్దకు వెళ్లి స్వాగతం పలకటం ఇప్పుడు విమర్శల పాలవుతుంది.
రాష్ట్రపతి, ప్రధాని సహా ఎంత పెద్ద వారు వచ్చినా తిరుమలకు చేరుకున్నాకే టీటీడీ అధికారులు స్వాగతం పలుకుతారు. కానీ ఇలా అలిపిరి వద్దకు వెళ్లి మరీ స్వాగతం పలికిన సందర్భాలు లేవని పలువురు ఆరోపిస్తున్నారు. అంతేకాదు స్వరూపానందకు స్వాగతం చెప్పే సమయంలో… తిరుమల శ్రీవారి సన్నిధిలో ధనుర్మాసంలో జరిగే తిరుప్పావై ఉత్సవాల సందర్భంగా మూల విరాట్‌కు శంఖం ఎడమచేతి వద్ద ప్రతిరోజు గోదాదేవి జ్ఞాపకార్థంగా అలంకరించే పవిత్ర ఆకులతో తయారు చేసిన ధనుర్మాస చిలకను తిరుమల ఆలయం నుండి అలిపిరి వద్దకు తీసుకొచ్చి మరీ స్వరూపానందకు ఇచ్చారు. ఇది ఆలయ నిబంధనలకు విరుద్ధమని, శ్రీవారి అలంకార పూలమాలను బయటకు ఇవ్వకూడదన్న విమర్శలు వస్తున్నాయి.
వీటన్నింటికి తోడు శ్రీవారి నిధులు కూడా శారదా పీఠానికి ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. జనవరి 3నుండి ఫిబ్రవరి 3వరకు నెల రోజుల పాటు హిందూ ధర్మపరిరక్షణ మహసభలు నిర్వహించబోతుంది శారదా పీఠం. ఇందు కోసం నిధులు కేటాయించాలని స్వరూపానంద ప్రభుత్వానికి లేఖ రాయగా… బాగా ఆదాయం ఉన్న ఆలయాలకు సాయం చేసే అవకాశాలు కల్పించాలని ఏపీ ఎండోమెంట్ డిపార్మెంట్ లేఖ రాసింది. ఇందులో తిరుమల కూడా ఉంది. దీంతో… నిధులు మంజూరు చేయటం ఇక లాంఛనమే అన్న చర్చ తిరుమల సహా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో జోరుగా సాగుతోంది.
సీఎం జగన్‌కు సన్నిహితంగా ఉండటం వల్లే అధికారుల అత్యుత్సాహాం, ఇప్పుడు నిధుల కేటాయింపులకు ఆలోచనలని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.