టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి తిరుమలలో యాంటీ డ్రోన్ టెక్నాలజీని తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు టీటీడీ ఈవో ధర్మా రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. తిరుమలలో డ్రోన్ సర్వేకు ఐవోసీఎల్ కు పర్మిషన్ ఇచ్చింది వాస్తవమన్నారు. అన్నదానం వద్ద నుండి డంపింగ్ యార్డ్ వరకు వారికి డ్రోన్ సర్వేకు పర్మిషన్ ఇచ్చామన్నారు. టీటీడీ భద్రతకు ఎక్కడా రాజీ పడటం లేదన్నారు. టీటీడీ దగ్గర హై సెక్యూరిటీ వ్యవస్థ ఉందన్నారు. త్వరలోనే తిరుమలకు యాంటీ డ్రోన్ టెక్నాలజీ తీసుకొస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మొదటగా ఈ టెక్నాలజీని తిరుమల కొండపై ఉపయోగించనున్నారు.
ఇలా దేశంలో ఒక ఆలయంపై యాంటీ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించడం ఇదే ప్రథమం. ఈ టెక్నాలజీతో తిరుమల కొండకు మరింత భద్రత కల్పించనున్నారు. ఇప్పటికే డ్రోన్ల వ్యవహారంపై కేసు నమోదు చేశామన్నారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుమని స్పష్టం చేశారు. వైరల్ అయిన వీడియోలు నిజమైనవా? లేక ఫేక్ వీడియోలా? అని తేలాల్సి ఉందన్నారు.
ఫేక్ వీడియోలు అయితే ఏమీ చేయలేమని.. కానీ నిజమైన వీడియోలు అయితే చర్యలు తప్పవన్నారు. కాగా ఈ వ్యవస్థను తిరుమల కొండపై ఏర్పాటు చేసేందుకు మొత్తం రూ.25 కోట్ల మేర ఖర్చవుతుందని అంచనా. త్వరలోనే డ్రోన్ జామర్ వ్యవస్థను తిరుమలకు తీసుకురానున్నట్లు వెల్లడించారు.
ఈ మధ్య తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఈ ఘటనను టీటీడీ సీరియస్ గా తీసుకుంది. అలాగే శ్రీవాణి ట్రస్టు నిధులు దారి మళ్లుతున్నాయన్న ప్రచారంపై ఈవో రియాక్ట్ అయ్యారు. శ్రీవాణి ట్రస్టుకు ఇప్పటివరకు రూ.650 కోట్లు సమకూరాయన్నారు. శ్రీవాణి ట్రస్టుకు ప్రత్యేక అకౌంట్ ఉందని.. అవి జనరల్ అకౌంట్ కు వచ్చే అవకాశం లేదని తెలిపారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి.