కరీంనగర్ లో పది ఎకరాల స్థలంలో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవాణి ట్రస్టుకు ఇచ్చే విరాళాలతో వెనుకబడిన ప్రాంతాల్లో ఆలయ నిర్మాణాలు, పురాతన ఆలయాల పునరుద్ధరణ చేస్తున్నామని పేర్కొన్నారు.
లక్ష రూపాయల కంటే తక్కువ విరాళం ఇచ్చే భక్తులకు.. శ్రీవాణి ట్రస్ట్ దాతలకు దర్శన సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. శ్రీవాణి ట్రస్ట్ టిక్కట్ల విధానంతో దళారి వ్యవస్థను అరికట్టగలిగామన్నారు. పది రోజుల్లో 6.09 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించగా.. హుండీ ద్వారా రూ.39.4 కోట్ల ఆదాయం లభించిందన్నారు ధర్మారెడ్డి.
కాగా శ్రీవారి ఆలయంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా రోజుకు 70 వేల మంది భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నామన్నారు. ఈనెల 28వ తేదీన రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సామాన్య భక్తులకు కేటాయించే గదుల ధరలు పెంచలేదని చెప్పారు. వీఐపీలకు కేటాయించే 170 గదులకు మాత్రమే ధరలు పెంచుతున్నట్లు స్పష్టం చేశారు.
అలాగే గత ఏడాది 2.37 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. హుండి ద్వారా రూ.1450 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. 11.54 కోట్ల లడ్డు ప్రసాదాలు విక్రయించామని, 4.77 కోట్ల మంది భక్తులకు అన్నప్రసాద సౌకర్యం కల్పించామని, 1.09 కోట్ల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని వెల్లడించారు ఈవో ధర్మారెడ్డి.