వచ్చే నెలలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్.రమణ సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చేసుకుంటున్నారు. పార్టీ గుర్తుపై కాకుండా అభ్యర్థి పేరుతో జరిగే ఎన్నికలు కావడంతో ఖచ్చితంగా కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన భావిస్తున్నారు.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల స్థానం నుంచి ఎల్.రమణ పోటీచేయనున్నారు. పలు బీసీ సంఘాలు కూడా రమణను బలపరుస్తున్నట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. దీనికి తోడు ఓటర్ల నమోదులో టీఆర్‌ఎస్, బీజేపీ కంటే కూడా టీడీపీనే ముందున్నదని.. ఎన్నికల్లో కూడా వారు తమకు మద్దతు ఇస్తారని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి ఎపీలో ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా కూడా పనిచేశారు ఎల్. రమణ. తెలంగాణ వచ్చాక మాత్రం ఏ చట్టసభలోకి అడుగు పెట్టే అవకాశం రాలేదు. 2014లో జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమిపాలు కాగా, 2018 ఎన్నికల్లో అప్పటి పొత్తుల్లో భాగంగా పోటీ చేయలేదు. ఇప్పుడు హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు రమణ.