టీఆర్ఎస్ కు షాకిచ్చారు మధు మోహన్. ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్, అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం ఈయన మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ ఛైర్మన్ గా ఉన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచారు మధు మోహన్. తర్వాత టీఆర్ఎస్ లో చేరి తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్ పదవిని దక్కించుకున్నారు. నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీరాములు యాదవ్ చర్చలు ఫలించి మధు బీజేపీ గూటికి చేరారు.
టీఆర్ఎస్ పాలనలో మున్సిపల్ ఛైర్మన్లు అన్యాయానికి గురవుతున్నారని ఆరోపించారు మధు మోహన్. అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. రాబోయే కాలంలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు.
ఆర్ఎస్ఎస్ స్వభావం కలిగిన మధు మోహన్ తిరిగి సొంత గూటికి చేరారని తరుణ్ చుగ్ అన్నారు. కేసీఆర్ ఎజెండాలో అభివృద్ధి అన్నదే లేదని ఆరోపించారు. అటు మధు మోహన్ బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామని బండి సంజయ్ అన్నారు. హిందూ ధర్మం కోసం ఆయన అనేక సందర్భాల్లో పోరాడారని గుర్తు చేశారు.